calender_icon.png 27 July, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిశంకు స్వర్గంలో బీసీలు!

27-07-2025 01:12:11 AM

వెనుకబడిన తరగతులకు జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగు తున్నప్పటికీ దీనిపై సందిగ్ధత మాత్రం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో.. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు 42 శాతం రిజర్వేషన్ అమలవుతుందని ఆశగా ఎదురుచూస్తున్న బీసీల దశాబ్దాల కల నెరవేరేందుకు అడ్డంకులు తొలగడం లేదు. బీసీ రిజర్వేషన్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, రిజర్వేషన్ అమలుకు అనుమతి ఇచ్చిందని బీసీ వర్గాలు సంతోషపడే లోపే కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం వారిని నిరాశకు గురిచేస్తున్నది.

దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందాన బీసీల ప్రస్తు త పరిస్థితి నెలకొంది. బీసీ రిజర్వేషన్ తేల్చి స్థానిక ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు నిర్దేశించిన గడువు, బీసీ రిజర్వేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిన ఆర్డినెన్స్, బీసీ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం తెలుపడంలో జరుగుతున్న జాప్యం వంటి పరిణామాల మధ్యన తెలంగాణలోని బీసీలు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.

అసలు కోర్టు విధించిన గడువులోగా స్థానిక ఎన్నికలు జరుగుతాయా, లేదా? ఎన్నికలు జరిగితే ఏ రిజర్వేషన్ల ప్రకారం జరుగుతాయో తెలియని గందరగోళంలో దిక్కుతోచని స్థితిలో బీసీలు ఉన్నారు. అయినప్పటికీ బీసీల ఆవేదనను పట్టించుకోకుండా పార్టీలన్నీ ఎవరికివారు యమునా తీరు అన్నట్టు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. 

ఇక మా పరిధిలో లేదంటున్న కాంగ్రెస్..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంలో బీసీ రిజర్వేషన్ అంశం కూడా ప్రధాన భూమిక పోషించింది. కామారెడ్డి డిక్లరేషన్‌లో భాగంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హామీ మేరకు అధికారంలోకి రాగానే ఆ దిశగా కార్యాచరణను కూడా ప్రారంభించారు. బీసీ రిజర్వేషన్ కోసమే కులగణన చేశారు. సర్వే నివేదిక మేరకు బీసీల లెక్క తేల్చి, ఆ ప్రకారం బీసీ బిల్లును కూడా రూపొందించారు.

బిల్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపిం చారు. అయితే నెలలు గడుస్తున్నా ఆమోదం మాత్రం రావడం లేదు. ఒక వైపు స్థానిక ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతుండటం, మరోవైపు బీసీల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలుకు ప్రత్యామ్నాయం వైపు మొగ్గుచూపింది. అందులో భాగంగా ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్ ఆమోదానికి పంపించింది. అయితే న్యాయ సలహా తీసుకోకుండా గవర్నర్ కూడా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను ఆమోదించేలా కనిపించడం లేదు.

గవర్నర్ కూడా ఆర్డినెన్స్‌పై న్యాయ సలహా కోసం కేంద్ర హోం శాఖకు పంపించారు. అటు బీసీ బిల్లు ఆమోదం రాష్ట్రపతి చేతిలో, ఇటు ఆర్డినెన్స్‌పై న్యాయ సలహా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు ఉన్న రెం డు మార్గాలు ప్రస్తుతం కేంద్రంలో చేతుల్లోనే ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. బీసీ రిజర్వేషన్ అమలు కోసం తమ పరిధిలో ఉన్నంత మేరకు చేశామని, ఇక మిగి లింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వంతు అంటున్నది. 

అది మీ బాధ్యతేనన్న ధోరణిలో బీజేపీ..

ముందు నుంచి బీజేపీ బీసీ రిజర్వేషన్ అమలుపై వ్యతిరేక వైఖరినే అవలంభిస్తుంది. కానీ రాష్ట్రంలో కులగణన ప్రక్రియ ను కాంగ్రెస్ పార్టీ పూర్తిచేసిన నేపథ్యంలో, బీజేపీ దేశవ్యాప్తంగా జన గణన చేపట్టనున్నది. అందులో కులగణననూ చేర్చింది. అయితే కాంగ్రెస్ ఒత్తిడితోనే బీజేపీ దేశంలో కులగణన చేస్తున్నదన్న వాదనలు వినిస్తుండటంతో మైలేజ్ అంతా కాంగ్రెస్‌కే వెళ్తు తుందని బీజే పీ అప్రమత్తమైంది.

బీసీ రిజర్వేషన్ అమలు కూడా జరిగితే బీసీలంతా కాంగ్రెస్ వెంటే ఉంటారని బీజేపీ భావిస్తున్నది. ఈ మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర భుత్వం బిల్లు చేసి ఆమోదానికి పంపినప్పటికీ రాష్ట్రపతి వద్ద ఫైల్ కదలడం లేదు. అయితే బీసీ బిల్లును బీజేపీ వ్యతిరేకిస్తున్నదని కాంగ్రెస్, బీసీలకు వివరిస్తున్న క్రమం లో బిల్లు ఆమోదించేందుకు తమకు ఎలాం టి అభ్యంతరం లేదని బీజేపీ అంటున్నది.

కానీ కాంగ్రెస్ చేసిన బిల్లు న్యా య పరిమితులకు లోబడి లేనందునే జాప్యం జరుగు తుందని వాదిస్తున్నది. బీసీ బిల్లుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేకపోవడంతోనే తప్పుల తడకగా రూపొందిం చిందని ఆరోపిస్తుంది. బీసీ బిల్లుకు అయి నా, ఆర్గినెన్స్‌కు అయినా న్యాయ సలహా తీసుకోకుండా ఎందుకు చేశారని కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఆనాలోచిత నిర్ణయాల కారణంగానే బిల్లు అమలు సాధ్యం కావడంలేదని దాటవేస్తున్నది. 

ఇద్దరూ దొంగలే అంటున్న బీఆర్‌ఎస్..

గత పదేళ్లలో ఏనాడు బీసీ రిజర్వేషన్ అమలు పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించని బీఆర్‌ఎస్, ప్రస్తుతం సరికొత్త పంథాను అందు కున్నది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దోబూ చులాడుతున్నాయని ఆరోపిస్తుంది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలు దొంగలే అంటూ విమర్శిస్తుంది. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈరకమైన విధానాలను అవలంభిస్తున్నాయని మండిపడు తున్నది.

కాంగ్రెస్, బీజేపీలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ అమలులో జాప్యమెందుకు జరుగుతున్నదని ప్రశ్నిస్తుం ది. అయితే బీసీ రిజర్వేషన్ అమలు మద్దతు ఇస్తామంటున్న బీఆర్‌ఎస్ వైఖరి కేవలం మాటలకే పరిమితమవుతున్నది. బిల్లు ఆమోదంలో జాప్యం జరగడంపై బీసీల పక్షాన పోరాటం చేసేందుకు మాత్రం ముం దుకు రావడం లేదు. అయితే గతంలో 34 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్‌ను 23 శాతం తగ్గించిన బీఆర్‌ఎస్, ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల గురించి ప్రశ్నించడంపై సర్వత్రా ఆశ్చ ర్యం వ్యక్తమవుతుంది. 

పరిష్కారమేదంటున్న బీసీలు..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడంపై రాజకీయ పార్టీలన్నీ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. కానీ తమ సమస్యను పరిష్కరించే దిశగా ఏ పార్టీ సరైన చిత్తశుద్ధి కనబర్చడం లేదని బీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

ఏళ్లు గడుస్తున్నా బీసీలను కేవలం ఓటు బ్యాంకుకే పరిమితం చేస్తున్నారని, పోటీ చేసే అవకాశం కల్పించేందుకు అందరూ నిరాకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సుమారు 56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కూడా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శిస్తున్నారు.

తమ పరిధిలో లేదంటే.. తమ పరిధిలో లేదంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాటవేత ధోరణిని అవలంభిస్తున్నాయని మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో అటు ప్రభుత్వాలు, ఇటు పార్టీల ప్రదర్శిస్తున్న వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధ్యం కాకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. 

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి