27-07-2025 12:55:37 AM
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): జైపాల్ రెడ్డి లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి చొరవతోనే తెలంగాణ ఏర్పాటు చేశామని సోనియా గాంధీ కూడా ఒక సందర్భంలో తనతో చెప్పారని రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇక్ఫాయ్, క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో జైపాల్ రెడ్డి డెమోక్రసీ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రము ఖ ఆర్థిక నిపుణులు, విశ్లేషకులు మోహన్ గురుస్వామికి జైపాల్ రెడ్డి డెమోక్రసీ తొలి అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నాటి ఐడియా లజికల్ పాలిటిక్స్ పోయి ఇవాళ స్విగ్గీ పాలిటిక్స్ వచ్చాయని, దేశ రాజకీయాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పోయి మేనేజ్‌మెంట్ పాలిటిక్స్ వచ్చాయన్నారు.
కార్యక ర్తలు పోయి వాలంటీర్ వ్యవస్థ వస్తోందని, కార్యకర్తలు లేని రాజకీయాలు దేశ భవిష్యత్‌కు ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. యూనివర్సిటీల్లో విద్యా ర్థి రాజకీయాలను ప్రోత్సహించాల్సిన అవసరముందని, దేశ రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని తగ్గించాలని కోరారు. ప్రతిపక్షాలు సహేతుకమైన సూచన చేస్తే స్వీకరించ డానికి తమకు ఇబ్బంది లేదని, తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవర్ని సస్పెండ్ చేయలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి అని, చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేశారని తెలిపారు. పరిపాలనలో తీసుకురావాల్సిన మార్పులపై జైపాల్ రెడ్డి ఎక్కువగా ఆలోచించేవారని, ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ అవసరమని గుర్తించి అభివృద్ధికి బాటలు వేశారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
రాజకీయాల్లో ధన ప్రవాహాన్ని తగ్గించాలని జైపాల్ రెడ్డి ప్రయత్నించారని, కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్‌లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప, పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదన్నారు. విద్యార్థి నాయకుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో జైపాల్ రెడ్డి పని చేశారని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, 5సార్లు లోక్‌సభ సభ్యుడిగా, 2సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారని సీఎం రేవంత్ తెలిపారు.
పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి అందించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని ఆయన విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారని సీఎం తెలిపారు. పార్లమెంట్‌లో రాణించిన వారి నుంచి మేధావుల వరకు ఎవరితోనూ జైపాల్ రెడ్డితో వ్యక్తిగత వైరం లేదని చెప్పారు. పీవీ, జైపాల్ రెడ్డి లాంటి వారి స్ఫూర్తి తెలంగాణ రాజకీయాల్లో ఉండాలన్నారు.