26-07-2025 11:02:18 PM
లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ..
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి..
భూత్పూర్: పదేళ్ల రేషన్ కార్డుల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి(MLA G. Madhusudan Reddy) అన్నారు. శనివారం భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలో కెవిఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పదేళ్లు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన్న పోలేదని ఆయన అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తుంటే టిఆర్ఎస్ ఓర్వలేక పోతుందన్నారు. అప్పుడు కానీ ఇప్పుడు కానీ పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు పడ్డారని, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సామర్థంగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఏడాదికి 13వేల కోట్లు వెచ్చించి రేషన్ షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులకు సన్న బియ్యం ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, రెండు లక్షల అరుణమాఫీ చేశామన్నారు. పదేళ్ల టిఆర్ఎస్ పార్టీ చేయని అభివృద్ధిని 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిందని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా విరమం లేకుండా పనిచేస్తుంటే అధికార దాహంతో కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, కేటీఆర్ చల్లని రూపాయి అని ఆయన మండిపడ్డారు. పైరవీలకు తావు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులను మంజూరు చేసినట్లు తెలిపారు. అనంతరం కొత్త రేషన్ కార్డులను, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిఎస్ఓ శ్రీనివాస్, ఎంపీడీవో, డిప్యూటీ తహసిల్దార్ గీత, మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, మహిళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పద్మ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్. భూపతి రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లిక్కీ విజయ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, హర్యానాయక్, నర్సింలు, నరేందర్, ఆగిరి రవి, మహబూబ్ పాషా, మనన్, మట్టి ఆనంద్, పరశురాం తదితరులు పాల్గొన్నారు.