07-09-2025 12:08:36 AM
దేశానికే అన్నంపెట్టే రైతన్నలకు సైతం అతితక్కువ ధరకే ‘సద్దిమూట’ కడుపు నింపుతోంది. వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకునేందుకు వచ్చే రైతులకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో మధ్యాహ్నం ఐదు రూపాయలకే భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. ‘సద్దిమూట’ అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు ఐదేళ్లలో లక్షన్నర మంది అన్నదాతల ఆకలి తీర్చారు.
మహబూబాబాద్ (విజయక్రాంతి); 2019లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మార్కెట్లలో సద్దిమూట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టగా, ఐదో మార్కెట్‌గా కేసముద్రాన్ని ఎంపిక చేసింది. హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రోజూ 300 నుంచి 500 మంది రైతులకు మధ్యాహ్న భోజనం అందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో రైతు రూ.5 చెల్లిస్తే, మార్కెటింగ్‌శాఖ రూ.27లను హరేకృష్ణ మిషన్‌కు మ్యాచింగ్ గ్రాంట్ కింద అందించి నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందిస్తోంది.
2019, ఫిబ్రవరిలో కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సద్దిమూట కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతోంది. గడచిన ఐదేళ్లలో 1,59,320 మంది రైతులు సద్దిమూట కార్యక్రమంలో మధ్యాహ్న భోజనాన్ని ఆరగించారు. ఇందుకు ఒక్కో రైతు 5 రూపాయలు చెల్లిస్తే, మార్కెటింగ్ శాఖ ఇప్పటివరకు హరే కృష్ణ మిషన్‌కు రూ.39,85,954 అందించింది. సద్దిమూట కార్యక్రమం ప్రారంభించక ముందు రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించేందుకు వచ్చినప్పుడు, వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం, తూకాలు వేయడం, ఎగుమతి చేయడానికి సాయంత్రం వరకు సమయం పట్టేది.
దీంతో ఉదయం మార్కెట్‌కు వచ్చిన రైతులు మధ్యాహ్న భోజనం చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. స్థానికంగా హోటల్‌లో భోజనం చేయడం.. లేదంటే ఇంటి నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కొంతమంది తమవెంట సద్ది తెచ్చుకుగా, ఇంకొందరు మధ్యాహ్నం తమ ఇంటి నుంచి తెప్పించుకొనేవారు. సరుకుల వద్ద కాపలాగా ఉండే పరిస్థితి లేక, వదిలి వెళ్లలేక కొందరు పస్తులు ఉండాల్సి వచ్చేది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న అప్పటి పాలకమండలి చైర్మన్ బీరవెల్లి ఉమా భరత్ కుమార్ రెడ్డి మార్కెట్లో సద్దిమూట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించారు.
హరే కృష్ణ మూమెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ నాణ్యతలో ఏమాత్రం అలసత్వం చూపకుండా నిర్దేశించిన నాణ్యత ప్రకారం వరంగల్‌లో ఏర్పాటుచేసిన కిచెన్ షెడ్ నుంచి ప్రత్యేక వాహనంలో హాట్ కంటైనర్ ద్వారా వేడిగా, రుచికరంగా తయారు చేసిన కూరలు, రసం, స్వీట్ సద్దిటలో మధ్యాహ్న భోజనం కింద అందిస్తున్నారు. 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల పప్పు, 100 గ్రాముల కూర, 20 గ్రాముల చట్నీ, మార్కెట్ సెలవు రోజు మినహా మిగతా అన్ని రోజుల్లో వేర్వేరు కూరలతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మార్కెట్ అన్ సీజన్‌లో 200కు తక్కువ కాకుండా సీజన్‌లో 500 మందికి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. దీంతో కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయించడానికి వచ్చిన అన్నదాతలు మధ్యాహ్న భోజనం సంతృప్తికరంగా చేస్తున్నారు.
బండి సంపత్ కుమార్,
డైనింగ్ హాల్ నిర్మిస్తాం..
కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో సద్ది మూట కార్యక్రమ నిర్వహణకు మరింత మెరుగైన వసతులు కల్పిస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా సద్ది మూట కార్యక్రమ అమలుకు స్థలం కేటాయించి, సకల వసతులతో డైనింగ్ హాల్ నిర్మించి, శాశ్వత ఏర్పాట్లు చేసి అన్నదాతలు కూర్చుని తినడానికి ఏర్పాట్లు చేస్తాం.
గంటా సంజీవరెడ్డి, చైర్మెన్, కేసముద్రం మార్కెట్ కమిటీ
సౌకర్యాలు కల్పించాలి..
రూ.5కే అన్నం పెట్టడం బాగుంది. సద్ది ఇంటి నుంచి తెచ్చుకొనే పరిస్థితి తొలగిపోయింది. ఐదు రూపాయలకు ఒకే గిన్నె పెడుతున్నారు. మరో గిన్నె కావాలంటే రూ.5అదనంగా తీసుకుంటున్నారు. ఐదు రూపాయలకే సరిపోను బువ్వ పెట్టాలి. కూసోని తినేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
లాలు, రైతు, బుక్యారం తండా