07-09-2025 12:10:06 AM
ప్రకృతి సోయగాల ఆసిఫాబాద్
చుట్టూ ఎత్తున పచ్చని గుట్టలు. పక్షుల కిలకిల రాగాలు. వీటి మధ్య గలగల పారే సెలయేటి సవ్వళ్లు. గుట్టల మీది నుంచి కిందికి జాలువారుతున్న జలపాతాలు. ఇవన్నీ ఒకే ప్రాంతంలో ఉండి, ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి. ప్రకృతి ప్రేమికుల నిలయంగా.. జలపాతాల వలయంగా పర్యాటకులకు ఆసిఫాబాద్ జిల్లా ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఏపీలోని విశాఖ జిల్లా అరకులోయను తలదన్నే ప్రకృతి అందాలు ఆసిఫాబాద్ జిల్లాలో దాగున్నాయనడానికి అతిశయోక్తి కాదు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయ క్రాంతి);జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు చాలా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ జలపాతాల నుంచి నీళ్లు జాలువారుతూ కనువిందు చేస్తున్నాయి. దీంతో జలపాతాల సందర్శనకు వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఆసిఫాబాద్ జిల్లాలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు స్థానిక అడవి బిడ్డలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
జలపాతాలు ఎక్కడున్నాయి?
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి 30 కిలో మీటర్ల దూరంలో సమితులగుండం జలపాతం ఉంది. లింగాపూర్ మండలంలోని పిట్టగూడ, లింగాపూర్ గ్రామాల మధ్య మిట్టే జలపాతం సందర్శకులను కనువిందు చేస్తున్నది. సిర్పూర్(యూ) మండలంలోని ఎత్తున గుట్టల నుంచి జాలువారే కుండాయి జలపాతం ప్రకృతి రమణీయతను చాటుకుంటుంది. తిర్యాణి మండలంలోని గుండాల, చింతలమాదర, ఉల్లిపిట్ట గ్రామాల సమీపంలో గుండాల, చింతలమాదర, ఉల్లిపిట్ట జలపాతాలు, వాంకిడి మండలంలోని సర్కెపల్లి గ్రామ సమీపంలో బుగ్గ జలపాతం ప్రకృతి రమణీయత ఉట్టి పడేలా కనువిందు చేస్తున్నాయి. కెరమెరి మండలంలో బాబేఝరి, కలైగాం గ్రామాల సమీపంలో, పెంచికల్ పేట మండలంలోని కొండెంగా లొద్ది జలపాతాలు గుట్టలపై నుంచి జాలువారుతున్నాయి.
చిప్ప సురేశ్,