విద్యార్థులను ప్రోత్సహించడానికి స్కాలర్‌షిప్ పరీక్ష
అనురాగ్ యూనివర్సిటీ అడ్మిషన్ డైరెక్టర్ డాక్టర్ మహిపతీ శ్రీనివాస్‌రావు
ఘట్ కేసర్, మే 15 (విజయక్రాంతి) : మద్యతరగతి విద్యార్థులు ట్యాలెంట్ ఉండి డబ్బులు లేని కారణంగా చదువులకు దూరం కాకుండా ప్రోత్సహించడానికి అనురాగ్ యూనివర్సిటీ మెరిట్ స్కాలర్ షిప్ పరీక్ష నిర్వహిస్తుందని యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ మహీపతి శ్రీనివాస్ రావు తెలిపారు. ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధి వెంకటాపూర్ లోని అనురాగ్ యూనివర్సిటీ ఆవరణలో ఈ నెల 17, 20 తేదిలలో మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
విద్యార్థులు పరీక్షలో సాధించిన ర్యాంక్ ల ఆధారంగా గరిష్ఠంగా 100శాతం వరకు స్కాలర్షిప్ తో పాటు ఉచిత ల్యాప్టాప్ లను కూడ పొందే అవకాశం ఉంఉందని, 1-15 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు 100 శాతం స్కాలర్ షిప్, 16-30 వరకు 50శాతం, 31-100శాతం వరకు 25శాతం స్కాలర్ షిప్ అందివ్వడం జరుగుతదని తెలిపారు. 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తున్నమని అన్నారు. యూనివర్సిటీ విద్యార్థులు గరిష్ఠంగా 53 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ సాధించారని పేర్కొన్నారు.
యూనివర్సిటీ లో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, హెచ్ సి ఎల్, సిస్కో, ఐబీఎం, టీవీఎస్, జేపీ మోర్గాన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు నియామకాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. పరీక్షకు ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదని, విద్యార్థులు ఉదయం 9:30 నిమిషాల వరకు యూనివర్సిటీ చేరుకోవాలని, వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, 2 ఫొటోలు వెంట తీసుకరావాలని సూచించారు.






