20-08-2025 01:49:46 AM
- ఈ ఏడాదే నావిక్ ఉపగ్రహం, ఎన్1 రాకెట్ ప్రయోగాలు
- 6,500 కిలోల అమెరికా శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపిస్తున్నాం
- 2035 నాటికి సొంత స్పేస్‌స్టేషన్ ఏర్పాటు
- టీమ్ వర్క్‌తో ఏదైనా సాధ్యమే
- ఉస్మానియా వర్సిటీ స్నాతకోత్సవంలో ఇస్రో చైర్మన్ వీనారాయణన్
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): అంతరిక్ష పరిశోధనల్లో భారత అం తరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ముందుకు దూసుకుపోతోందని, ఇందులో భాగంగానే 40 అంతస్తుల భవనమంత జంబో రాకెట్ నిర్మిస్తున్నామని ఇస్రో చైర్మన్ వీ నారాయణన్ తెలిపారు. 75 టన్నుల పేలోడ్‌ను తక్కు వ ఎత్తులోని భూకక్ష్యలోకి తీసుకెళ్లగలదని పేర్కొన్నారు. ఈ ఏడాది నావిక్ ఉపగ్రహం, ఎన్1 రాకెట్ వంటి ప్రాజెక్టులను సైతం చేపట్టనుందన్నారు. 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్నది భారతదేశం లక్ష్యమన్నారు.
మంగళవారం ఉస్మాని యా యూనివర్సిటీ 84వ స్నాతకోత్సవానికి హాజరైన ఆయనకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనంతరం ఇస్రో ఛైర్మన్ నారాయణన్ మా ట్లాడుతూ.. భారతీయ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యూరికేషన్ శాటిలైట్‌ను కక్ష్యలోకి చేర్చే ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుందని తెలిపారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రూపొందించిన మొదటి లాంచర్ 17 టన్ను ల బరువు కలిగి ఉండేదని, ఇది 35 కిలోల ఉపగ్రహాన్ని దిగువ భూకక్ష్యకు చేర్చిందన్నారు.
కానీ ప్రస్తుతం 75,000 కిలోల బరు వైన పేలోడ్‌ను దిగువ భూకక్ష్యకు చేర్చడంపై పనిచేస్తున్నామని, అందుకు అవసరమైన రాకెట్ 40 అంతస్తుల భవనం అంత భారీ ఎత్తులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది ఇస్రో భారత నావికాదళం కోసం నిర్మించిన టెక్నాలజీ ప్రదర్శన ఉపగ్రహం, మిలటరీ కమ్యూనికేషన్ ఉపగ్రహం జీఎస్‌ఏటీ ప్రయోగించాలని యోచిస్తు న్నట్లు తెలిపారు. ఇది ప్రస్తుత జీఎస్‌ఏటీ ఉపగ్రహాన్ని భర్తీ చేయనుందని తెలిపారు.
ప్రస్తుతం భారత్‌కు కక్ష్యలో 55 ఉపగ్రహాలు ఉన్నాయని, వచ్చే మూడు నా లుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలు గు రెట్లు పెరుగుతుందని తెలిపారు. ప్రస్తు తం ఇస్రో విజయాల ముందు ప్రపంచం నివ్వెరపోతోందని, ఇందుకు ఇటీవలి విజయాలే సాక్ష్యమన్నారు. ఒకే రాకెట్ ద్వారా 106 శాటిలైట్లను పంపిన ఘనత సహా, ఇస్రో సాధించిన ప్రతి విజయం వెనుక టీం వర్క్ ఉందని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి నాయకత్వంలో ఇస్రో సంచనల విజయాలు నమోదు చేసుకుందన్నారు. ఆపరేషన్ సిం ధూర్‌లో దేశ సైనిక అవసరాలకు అవసరమైన ఖచ్చితతత్వమైన సమాచారాన్ని ఇస్రో అందించిందని ఆయన పేర్కొన్నారు.
25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా..
భారత్ రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్పేస్ రంగంలో 50 ఏళ్ల క్రితం అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 70 ఏళ్లు వెనకబడి ఉన్న భారతదేశం.. ఇప్పుడు ఆయా దేశాలతో పోటీపడే స్థాయికి ఎదిగిందని వెల్లడించారు. అంతేకాకుండా అగ్రరాజ్యమైన అమెరికాలో రూ పొందించిన శాటిలైట్లను కమర్షియల్ పద్ధతిలో లాంచ్ చేసే స్థాయికి భారత్ చేరడం గొప్ప విషయమన్నారు. 108 ఏళ్ల చారిత్రక నేపథ్యం కలిగిన ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయ గౌరవ డాక్టరేట్ స్వీకరించటం అత్యంత గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ గౌరవ డాక్టరేట్ మొత్తం ఇస్రోలో పనిచేస్తున్న 20 వేల మంది కృషి ఫలితమని, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పీహెచ్‌డీ పట్టా లు, బంగారు పతకాలు పొందిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. పట్టాలు పొందడంతోనే విద్య ఆగిపోవద్దని ఆకాంక్షించిన నారాయణన్.. నిరంతర పరిశోధనలు, అధ్యయనంతో ఎంచుకున్న వృత్తిలో రాణించాలన్నారు. అధ్యాపకులు, తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల త్యాగాలతో ఉన్నత చదవులు చదివిన విద్యార్థులు తిరిగి సమాజా భివృద్ధి, తోటివారికి చేయుతనిచ్చే విధంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. టీమ్ వర్క్‌తో ఏదైనా సాధ్యమేనని, ఉస్మానియా వర్సిటీ సాధిస్తున్న విజయాలను ఆయన అభినందించారు.