calender_icon.png 23 January, 2026 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కశ్మీర్‌లో ఘోర ప్రమాదం

23-01-2026 12:00:00 AM

  1.   200 అడుగుల లోయలో పడిన ఆర్మీ వాహనం  
  2.   10 మంది సైనికుల మృతి
  3. గాయపడిన సైనికులు మిలిటరీ ఆస్పత్రికి తరలింపు
  4. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం, కేంద్ర రక్షణ మంత్రి

శ్రీనగర్, జనవరి 22: జమ్మూ కశ్మీర్‌లోని దొడా జిల్లాలోని భదేర్వా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. భారత్ ఆర్మీకి చెందిన వాహనం దాదాపు 200 అడుగుల లోయలో పడిపోవడంతో 10 మంది ఆర్మీ సిబ్బంది మరణించారు. ఆర్మీ వాహనం ఎత్తున పోస్ట్ వైపు వెళుతుండగా డ్రైవర్ ఆదుపు చేయలేకపోవడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో పది మంది గాయపడ్డారు. భదేర్వా-చంబా అంతర్రాష్ట్ర రహదారి వెంబడి ఖన్నీ టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

విషయం తెలియగానే ఆర్మీ,జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిలో కొందరికి తీవ్ర గాయాలు కాగా, వారిని ప్రత్యేక చికిత్స కోసం హెలికాప్టర్ ద్వారా ఉధంపూర్ సైనిక ఆస్పత్రికి తరలించారు. ఈ దుర్ఘటన పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన సైనికులకు సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ప్రమాదం జరిగిన వెంటనే తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిన ఆర్మీ, పోలీస్ సిబ్బందిని సీఎం ప్రశంసించారు. అలాగే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు తీవ్ర సంతాపం తెలిపారు. ‘దోడాలో జరిగిన విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో 10 మంది భారత సైన్యంలోని వీర సైనికులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి. గాయపడిన సైనికులకు వైద్య సంరక్షణ అందుతోంది. సాధ్యమైనంత మెరుగైన చికిత్సను అందించాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చాం. ఈ క్లిష్ట సమయంలో దేశం మన సాయుధ దళాలు, వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది’ అని ఆయన ట్వీట్ చేశారు.