07-09-2025 12:14:06 AM
సాధారణంగా మనకు రోజు నాలుగు జాములు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి.. కానీ ఈ పల్లెలో రోజు మూడు జాములే ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, ఇక నేరుగా రాత్రే.. సాయంత్రమనేదే ఎరుగదు. మధ్యాహ్నం మూడు గంటలకే సూర్యుడు అస్తమిస్తాడు. ఉదయం ఏడున్నర దాటితేగాని సూర్యకిరణాలు ఈ గ్రామాన్ని తాకవు. ఈ వింతైన పల్లె మరెక్కడో కాదండోయ్.. మన రాష్ట్రంలోనే ఉంది. అదీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాక.. దీన్ని ముచ్చటగా మూడు జాముల కొదురుపాక అని కూడా పిలుస్తుంటారు.
(కరీంనగర్ విజయక్రాంతి); అచ్చమైన పల్లె వాతావరణాన్ని ఇంకా కాపాడుకుంటున్న కొదురుపాక గ్రామం.. ఇటీవల మరోసారి చర్చల్లోకి వచ్చిం ది. కారణం గత ఏడాది విడుదలైన ‘క’ అనే తెలుగు సినిమాలో ఇక్కడున్న గ్రామ పరిస్థితిని తెరకెక్కించారు. దీంతో మరోసారి ఈ మూడు జాముల కొదురుపాక గురించి ప్రపంచానికి తెలిసింది. మధ్యాహ్నం మూడు దాటిందంటే ఇళ్లల్లో చీకట్లు కమ్ముకుంటాయి.. సరిగ్గా చెప్పాలంటే.. ఇతర ప్రాంతాల్లో సాయంత్రం ఆరు గంటలకు ఉండే వాతావరణం ఈ గ్రామంలో మాత్రం ఓ గంటన్నర ముందే కనిపిస్తుంది.
కొత్తవారికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. కొదురుపాకవాసులకు మాత్రం ఇది అలవాటైపోయిం ది. సాధారణంగా అన్ని గ్రామాలు నాలుగు జాముల కాలాన్ని అనుభవిస్తూంటే.. కొదురుపాకలో మాత్రం మూడు జాముల కాలమే ఉంటుంది. ఈ గ్రామంలో సాయంత్రం 4 గంటలు దాటిందంటే చాలు.. ఇళ్లల్లో దీపాలు వెలుగుతుంటాయి. ఎందుకంటే అప్పటికే చీకటి పడుతుంది. ఇక్కడ సాయంత్రం అనేదే ఉండదు. ఉదయం సూర్యుడు కూడా ఆలస్యంగానే దర్శనమిస్తాడు. అందుకే మూడు జాముల ప్రాంతంగా పేరొచ్చింది.
అంతటా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఉంటే, కొదురుపాకలో మాత్రం ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మాత్రమే ఉంటాయి. సాయంత్రం జాము అస్సలు ఉండదు. ఎందుకంటే నాలుగు గంటలకే ఇక్కడ సూర్యుడు అస్తమిస్తాడు. 4 గంటల ప్రాంతంలో సూర్యుడు గ్రామ పడమర దిక్కున ఉన్న రంగనాయకుల గుట్ట వెనక్కి వెళ్తాడు. దీంతో ఈ గ్రామాన్ని చీకటి అలుముకుంటుంది. ‘క’ అనే సినిమాలో ఓ గ్రామంలో ఇటువంటి పరిస్థితులనే చూపించడంతో మరోసారి ఈ మూడు జాముల కొదురుపాక పేరు మారు మోగింది.
ఈ గ్రామానికి ఇలాంటి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడడానికి ఓ కారణం ఉంది.. నాలుగు గుట్టల మధ్య ఈ గ్రామం ఏర్పడింది. పాముబండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట అనే నాలుగు గుట్టల మధ్య లో ఈ గ్రామం ఉంది. ఈ ఎత్తయిన గుట్టల కారణంగా కొదురుపాకలో ఆలస్యంగా సూర్యోదయం, ముందుగానే సూర్యాస్తమ యం జరుగుతుంటాయి. గుట్టల నీడతో గ్రామంలో చీకటి అలుముకున్నట్టుగా ఉం టుంది.
ఈ మూడు జాముల కొదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది.. ఈ గ్రామానికి పశ్చిమాన ఉన్న రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడి విగ్రహం ఉండదు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే భక్తులకు దేవుడు దర్శనమిస్తాడు. దసరా పండుగ వేళ జరిగే వేడుకకు.. దేవునిపల్లి నుంచి నంబులాద్రి నరసింహ స్వామిని ఈ దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయంలో ఒకరోజు వైభవంగా ఉత్సవాలు జరిపిన తర్వాత తిరిగి దేవునిపల్లికి చేరుస్తారు. ఈ సంప్రదాయం తరతరాలుగా వస్తుండటంతో.. ఇప్పటికే ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు మూడు జాముల కొదురుపాకవాసులు.
బల్మూరి విజయసింహరావు