calender_icon.png 9 September, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లీకూతుళ్ల సన్నాయి పాట

07-09-2025 12:12:35 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి); ఛీఛీ నీకు ఇదేం పోయేకాలం.. బ్యాండ్ మేళంలో మగాళ్ల మధ్య పాటలు పాడుతూ ఊర్లు తిరుగుతావా అంటూ ‘సన్నాయి’ నొక్కులు నొక్కిన వారంతా ఇప్పుడు ఆ తల్లీకూతుళ్ల సన్నాయి పాటలు విని ఆహా ఎంత గొప్పగా పాడుతున్నారంటూ మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కొందరు మహిళలు వీరి వద్ద శిష్యులుగా చేరి సన్నా యి పాటలు పాడుతూ జీవనోపాధి పొందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండకు చెందిన అరబండి తార తన తండ్రి గాడిపల్లి ఎల్లయ్య స్ఫూర్తితో పదేళ్ల వయసులోనే బ్యాండ్‌మేళంలో చేరి కళాకారులు వాయించే వాయిద్యాలను నేర్చుకుంది.

క్లారినెట్, క్యాసి యో, తాశే సహా పలు వాయిద్యాలను వాయిస్తూ తండ్రితో పాటు వివిధ కార్యక్రమాలకు వెంట వెళ్లేది. తండ్రి ఎల్లయ్య కూడా కూతురు తారను ప్రోత్సహించి బ్యాండ్ మేళంలో ఉండే ప్రతి పరికరాన్ని నేర్చుకునేలా ఆమెకు ప్రోత్సహించాడు. ఆ సమయంలో ‘తార’ సమాజం నుంచి అనేక ఛీత్కా రాలు ఎదుర్కొంది. నీకెందుకమ్మా బ్యాండ్ మేళం అంటూ హేళన చేసేవారు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంతలోనే ఆమె తండ్రి మరణం మరణించడంతో కుంగిపోయింది. ఆ బాధనుంచి బయటపడి మళ్లీ బ్యాండ్ మేళం చేతబూనినా ఆశించిన గిరాకీ దొరకలేదు.

దీంతో ఆమె ‘సన్నాయి’ వాయిద్యం వాయించడం నేర్చుకుంది. తార పట్టుదలతో నేర్చుకున్న సన్నాయి వాయిద్యం ద్వారా కొంత గుర్తింపు రావడంతో పాటు, కొత్తకొత్త పాటలను, సందర్భానుచిత పాటలను కఠోర శ్రమతో నేర్చుకొని వినులవిందుగా వాయిస్తుండటంతో ‘తార’కు ప్రత్యేక గుర్తింపు లభించింది. తాను నేర్చుకున్న సన్నాయి వాయిద్యంతో కుటుంబాన్ని పోషిస్తూ, తన ముగ్గురు కుమార్తెలు అంబిక, వెన్నెల, అఖిలకు కూడా సన్నాయి వాయిద్యం నేర్పింది. ప్రస్తుతం తారతోపాటు అంబిక సన్నాయి వాయిద్యంలో మహబూబాబాద్ జిల్లాలోని కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంచి పేరు సంపాదించారు.

నాడు ఛీత్కరించిన వారే నేడు గౌరవిస్తున్నారు. గ్రామంలో జరిగే ప్రతి శుభకార్యానికి తార, అంబికల సన్నాయి వాయిద్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో జరిగే శుభకార్యాల్లో వీరికి అవకాశం కల్పిస్తున్నారు. వైవిధ్యమైన వృత్తిని ఎంచుకొని, సమాజం నుంచి ఎదురైన అనేక ఛీత్కారాలను ధైర్యంగా ఎదురొడ్డి నిలిచి, సన్నాయి వాయిద్యం కళ ద్వారా గుర్తింపు తెచ్చుకొని, పదిమందికి జీవనోపాధి కల్పించిన ‘తార’ మహిళాలోకానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తన తండ్రి పెట్టిన భిక్ష అంటూ గ్రామంలో తండ్రి ఎల్లయ్య శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తార గొప్ప మనసుకు నిదర్శనం. 

 బండి సంపత్‌కుమార్, 

ప్రభుత్వం ఆదుకోవాలి..

సమాజం నుంచి అనేక ఛీత్కారాలు ఎదుర్కొన్న నేను, ప్రస్తుతం సన్నాయి వాయిద్యంతో గుర్తింపు పొందడం ఆనందంగా ఉంది. సన్నాయి వాయిద్యం ద్వారా నా కుటుంబంతోపాటు ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నా. అయితే నికరమైన ఆదాయం లేకపోవ డం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్ర భుత్వం స్పందించి తమ కళను ప్రోత్సహించడానికి, విభిన్నమైన రంగంలో నిలదొక్కుకునేందుకు నెలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించాలి. అప్పుడే మహిళలు విభన్న రంగాల్లో రాణించగలుగుతారు. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలి.

 అరబండి తార, సన్నాయి వాయిద్యం కళాకారిణి