కామారెడ్డి మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు
- మున్సిపల్ ఆదాయానికి రూ.కోట్లలో గండి
అధికారులు, సిబ్బంది చేతివాటం!
భవన నిర్మాణల అనుమతుల కోసం 169 దరఖాస్తులు
కేవలం 18 దరఖాస్తులే క్లియరెన్స్
గడువు దాటినా అనుమతి ఇవ్వని వైనం
10 గంటల పాటు సోదాలు
కామారెడ్డి, మార్చి 16 (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ అధికారుల తీరుపై బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. సోమవారం ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించగా విధుల్లో కావాలనే అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు వెల్లడైంది. అధికారుల సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ ఆదాయానికి కోట్ల రూపాయల గండి పడినట్టు తెలుస్తున్నది.
2025 ఆర్థిక సంవత్సరంలో నిబంధనలకు విరుద్ధంగా 47 అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలు చేపట్టారని మున్సిపల్ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. 400 కమర్షియల్ దుకాణాల వారు టాక్స్ చెల్లించాల్సి ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్ల కోటి రూపాయలకు పైగా ఆదాయం మున్సిపల్‌కు గండి పడింది. ఇంటి పన్నుల అసెస్మెంట్లో సైతం అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించినట్లు తెలిసింది.
దుకాణదారులు, భవన యజమానులకు పన్ను తక్కువ చేస్తామని వారి నుంచి లంచం తీసుకున్నట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. రూ.12.4 లక్షల ఫ్యూయల్ ఖర్చులకు సంబంధించిన రికార్డులు కూడా లేనట్టు తెలిసింది. ఎలాంటి రికార్డులు, వాటి కి సంబంధించిన రిసిప్టులు లేకుండా బిల్లు డ్రా చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులకు గైర్హాజరైనా వారి వేతనాలు పూర్తిస్థాయిలో డ్రా చేశారు.
డిసెంబర్ 2025 వరకు భవన నిర్మాణాల పర్మిషన్ కోసం 169 మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని వివరాలతో దరఖాస్తు చేసిన వాటిని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు. కేవలం 18 దరఖాస్తులకు సంబంధించిన వాటిని మాత్రమే పరిశీలించారు. 25 రోజుల గడువు ముగిసిన కూడా ఫీల్ విజిట్ చేయకుండా పర్మిషన్ దరఖాస్తులను పెండింగ్లో పెట్టారు. వీటన్నింటిపై నివేదిక అందిస్తామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు.




