3 September, 2026 | 11:01 AM

సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

03-09-2026 | 10:29am

సూర్యాపేట,సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (Town Planning Officer) వి.సోమయ్య ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (Anti-Corruption Bureau) అధికారులు గురువారం ఉదయం తనిఖీలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏసీబీ అధికారులు(ACB officials)  సూర్యాపేట పట్టణంలోని మానస నగర్ లో గల అతని ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తూ నగదు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన వివరాలు, ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఇతర కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తుంది.

టౌన్ ప్లానింగ్ విభాగంలో(Town Planning Department) భవన నిర్మాణ అనుమతులు, నిబంధనల అమలు తదితర అంశాలతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాల్లో ఆదాయానికి మించిన ఆస్తులు, నగదు లేదా ఇతరఅనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా బయటపడ్డాయా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏసీబీ అధికారులు తనిఖీలు పూర్తిచేసిన అనంతరం స్వాధీనం చేసుకున్న నగదు, పత్రాలు, ఆస్తుల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. కాగా టౌన్ ప్లానింగ్ అధికారిపై గతంలో కూడా విధులకు సంబంధించిన విషయాలలో అనేక ఆరోపణలు రావడం గమనించదగ్గ విషయం.