కర్రెగుటల్లో ఇంకా బాంబులు ఉన్నాయా?
బాంబు పేలుడు ఘటనలో వ్యక్తి మృతి
ములుగు (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్(Operation Kagar) నేపథ్యంలో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలించినట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా(Mulugu District) కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు. అయితే బుధవారం వెదురు బొంగుల కోసం ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురుకు చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తితో పాటు మరో ఐదుగురు కలిసి అడవిలోకి వెళ్లారు.
ఈ క్రమంలో వెదురు బొంగులతో తిరిగి వస్తుండగా బాంబుపై కాలు వేయడంతో పేలుడు సంభవించి నాగేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. దీనితో అతన్ని సహచరులు డోలి ద్వారా తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో కర్రెగుటల్లో(Karreguttalu) అప్పట్లో నక్సలైట్లు ఏర్పాటు చేసిన మందు పాతరలు అనేక ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటన మరోసారి ములుగు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






