3 September, 2026 | 11:28 AM

బీసీ బాలుర వసతిగృహంలో సమస్యల తిష్ట...?

03-09-2026 | 10:27am

విజయక్రాంతి విజిట్...

కిటికీలకు అట్టలు, దుప్పట్లే తలుపులు.. బాత్రూంలకు విరిగిన తలుపులు

‘వండామా.. పెట్టామా’ అన్న చందంగా భోజనం...!

నాణ్యత లేని భోజనంపై విద్యార్థుల ఆవేదన...

జిల్లా ఉన్నతాధికారులు పర్యవేక్షించెనా...?

బాన్సువాడ, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ పట్టణంలోని చైతన్య కాలనీలోని బీసీ బాలుర వసతిగృహంలో( BC boys hostel) విద్యార్థులకు కనీస వసతులు కరువవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుధవారం రాత్రి విజయక్రాంతి(Vijayakanthi ) విజిట్ చేసింది. వసతిగృహంలోని కిటికీలకు తలుపులకు బదులుగా అట్టలు,దుప్పట్లు ఏర్పాటు చేయడం, బాత్రూంల తలుపులు విరిగిపోయి ఉండటం వంటి సమస్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని విద్యార్థులు(Students), తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు విద్యార్థులకు అందించే భోజనంపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

కూరల్లో కొత్తిమీర, మిరపకాయలు, కల్యామాకు,ఆవాలు, జీలకర్ర , వంటి కనీస పదార్థాలు కూడా సరిగా అందుబాటులో లేకపోవడంతో రుచిలేని భోజనం పెట్టాల్సిన పరిస్థితి నెలకొందని వారు ఆరోపిస్తున్నారు. ‘వండామా.. పెట్టామా’ అన్న చందంగా భోజనం అందిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల వసతి, పారిశుధ్యం, భోజనం విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్నది అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి వసతిగృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వసతిగృహంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు మెరుగైన వసతి, పరిశుభ్రమైన వాతావరణం, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.



సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశా: ప్రతిభ, వార్డెన్, బీసీ బాలుర వసతిగృహం, బాన్సువాడ.

వసతిగృహంలో నెలకొన్న వివిధ సమస్యలపై విజయక్రాంతి వసతి గృహ వార్డెన్ ప్రతిభను వివరణ కోరగా నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వార్డెన్ ప్రతిభ(Warden Talent) తెలిపారు. విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులు, వసతుల కొరత తదితర అంశాలపై సమగ్ర నివేదికను సంబంధిత ఉన్నతాధికారులకు అందజేసినట్లు పేర్కొన్నారు. వంట విషయంలో విద్యార్థులకు ఏ విధంగా వండలో ఆ విధంగానే వండడం జరుగుతుందని ఆమె సమాధానం చెప్పుకు రావడం గమనార్హం.