24 April, 2026 | 9:07 AM

ఫార్ములా ఇ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు

19-12-2024 05:40 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఫార్ములా ఇ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పై అవినీతి నిరోధక శాఖ గురువారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ (ఏ1), ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రెండో నిందితుడిగా (ఏ2), బీఎల్ఎన్ రెడ్డి మూడో నిందితుడిగా(ఏ3) ఉన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఇ రేస్ ఈవెంట్‌కు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్‌ ఏసీబీకి ఇప్పటికే లేఖ రాశారు.

కేటీఆర్‌పై అవినీతి నిరోధక చట్టం కింద పలు నాన్‌బెయిలబుల్‌ అభియోగాలు నమోదైనట్లు సమాచారం. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఫార్ములా ఇ కార్ రేస్‌లు జరిగాయి. ఈ పందేల కోసం అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ నిబంధనలను దాటవేసి నేరుగా ప్రైవేట్ సంస్థలకు నిధులు మంజూరు చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఇప్పటికే గవర్నర్ నుంచి అనుమతి పొందడం గమనార్హం.