వజ్రోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి తుమ్మల
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. శుక్రవారం, శనివారం నిర్వహించే కార్యక్రమాల్లో మహిళా రైతులు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. గురువారం వ్యవసాయ కార్యదర్శి, రఘునందన్ రావు ఐఏఎస్, కమిషనర్ గోపి ఐఏఎస్ లతో కలిసి మంత్రి రాజేంద్రనగర్ లోని పీజేటీఏయూ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఆడిటోరియంను పరిశీలించారు. ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇతర ఉన్నతాధికారులు జరుగుతున్న ఏర్పాట్లను మంత్రితుమ్మలకు వివరించారు. కార్యక్రమాల నిర్వహణలో సమయపాలన పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రైతులకి ఉపయోగపడేలా, ఆవరణలో అనువైన ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. గవర్నర్, విశ్వవిద్యాలయ కులపతి జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, పర్యటన, ప్రసంగ కార్యక్రమాల్లో సమయపాలన పాటించాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.






