25-12-2025 02:32:53 PM
భువనేశ్వర్: ఒడిశాలో ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. కంధమాల్ జిల్లా గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత గణేశ్ ఉయికే మృతి చెందాడు. మృతి చెందిన మావోయిస్టు గణేశ్ ఉయికే నల్గొండ జిల్లా పుల్లేంల వాసిగా గుర్తించారు. గణేశ్ ఉయికే సీపీఐ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. గణేశ్ ఒడిశాలో మావోయిస్టు కార్యకలాపాలకు కీలక బాధ్యతలు స్వీకరించారు. గణేశ్ సుమారు 40 ఏళ్లు మావోయిస్టు ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు.
అటవీ ప్రాంతంలో మావోయిస్టు బలాన్ని పెంచడంలో గణేశ్ దే కీలక పాత్ర. భద్రతా బలగాలపై దాడుల ప్రణాళికలో గణేశ్ ప్రధాన పాత్ర నిర్వహించినట్లు గుర్తించారు. గణేశ్ ఉయికేపై రూ. 1.10 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాల నుండి రైఫిళ్లు, ఒక 303 రైఫిల్, ఒక రివాల్వర్, కమ్యూనికేషన్ పరికరాలతో సహా ఆయుధాలు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పొరుగున ఉన్న మల్కన్‌గిరి జిల్లాలో ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముందు 22 మంది మావోయిస్టులు లొంగిపోయిన కొన్ని రోజుల తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.