calender_icon.png 23 January, 2026 | 10:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల అక్రమ దత్తత కేసులో నిందితుల అరెస్ట్

23-01-2026 08:33:16 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): మున్సిపాలిటీలోని మొదేల లో ఒక చిన్నారిని అక్రమంగా దత్తత తీసుకున్నారనే సమాచారంపై చైల్డ్ హెల్ప్ లైన్ అధికారుల విచారణ చేయగా, దాని ఆధారంగా జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్ కింద కేసు నమోదు చేసి, మొదేలకు చెందిన దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఎలుగటి తిరుపతి, కళావతిలు అక్రమంగా దత్తత తీసుకున్న మూడేళ్ల బాలికను చైల్డ్ వెల్ఫేర్ అధికారులు రక్షించి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదిలాబాద్ ఎదుట హాజరుపరచారని సిఐ రమణమూర్తి శుక్రవారం తెలిపారు.

సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఏ1-గా మంచిర్యాల జిల్లాలోని తీగల్ పహాడ్ అల్లూరి సీతారామరాజు కాలనీ చెందిన పరిగిపండ్ల విజయలక్ష్మి, ఏ2- లక్షెట్టిపేట మహాలక్ష్మివాడకు చెందిన బొజ్జ స్వరూప అనే వారు పిల్లలు లేని దంపతులను ఆసరాగా తీసుకొని, వారి వద్ద భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి, ఎలాంటి చట్టబద్ధమైన దత్తత నిబంధనలు పాటించకుండా పిల్లలను అక్రమంగా దత్తతకు ఇచ్చినట్లు గుర్తించడం జరిగిందన్నారు.

పైన పేర్కొన్న నిందితులను శుక్రవారం అరెస్ట్ చేసి, న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు  తరలించామని అన్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తదుపరి విచారణ కొనసాగుతుందన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో చాక చక్యంగా వ్యవహరించిన సిబ్బంది శ్రీకాంత్, మల్లేష్, బగ్గని సత్యనారాయణ, ఎంబడి సత్యనారాయణ, మురళి, ప్రవళిక లను సీఐ రమణమూర్తి ఊ అబినందించారు. అక్రమంగా పిల్లలను దత్తత తీసుకున్నా, ఇచ్చినా, రవాణా చేసినా లేదా తరలించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.