28-11-2025 06:25:23 PM
మంచిర్యాల టౌన్,(విజయక్రాంతి): బీజేపీ వేమనపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కేసులో నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ యంత్రాంగం గతంలో అరెస్టు చేయడంలో జాప్యం చేయడం కారణంగా నిందితులు అరెస్టు కాకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారని, ఆ స్టేపై బీజేపీ న్యాయవాదులు హైకోర్టులో బలంగా వాదనలు వినిపించడంతో శుక్ర వారం స్టే వెకేట్ చేసిందన్నారు.
మధుకర్ మరణానికి కారణమైన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేయడానికి మార్గం సుగమం అయిందని, కనీసం ఇప్పుడైనా పోలీసులు వారిని అరెస్టు చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. గతంలో నిందితులను శిక్షిస్తామని హామీ ఇచ్చిన బెల్లంపల్లి ఎంఎల్ఏ గడ్డం వినోద్ అదే నిందితులతో అధికారిక కార్యక్రమాలు చేపడుతున్నారని, చాప పిల్లల పంపిణీ, చీరల పంపిణీ కార్యక్రమం లాంటి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిందితులకు బాసటగా నిలుస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని, ఇప్పటికైనా నిందితులను శిక్షించడానికి సహకరించాలని ఆయన డిమాండ్ చేశారు.