11-10-2025 01:45:34 AM
ఎస్పీ డీ.వీ.శ్రీనివాసరావు
మెదక్, అక్టోబర్ 10 :భర్తను హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ డివి.శ్రీనివాసరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..హవేళీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శమ్నాపూర్ గ్రామానికి చెందిన సంగపోల్లా మలయ్య (50) మూడు సంవత్సరాలు దుబాయ్లో పనిచేసి, సంవత్సరం క్రితం తిరిగి గ్రామానికి వచ్చి వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
మలయ్య భార్య సంగపోల్లా లక్ష్మీకి గ్రామానికి చెందిన జాల రాందాస్తో అక్రమ సంబంధం ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవన్నారు. ఈ విషయంపై గ్రామ పెద్దలు పలుమార్లు పంచాయతీలు నిర్వహించి వారిని హెచ్చరించినా పరిస్థితి సద్దుమణగలేదన్నారు. ఫిబ్రవరి 24, 2020లో భార్యాభర్తల మధ్య మళ్లీ తగవు జరిగి, మలయ్య తమ్ముడు నర్సింలు వచ్చి సర్ది చెప్పి ఇంటికి వెళ్లిపోయాడు.
తర్వాత రోజు ఉదయం మలయ్య మృతదేహం ఇంట్లో కనిపించడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మలయ్య మృతి విషయంలో న ర్సింలు తన వదిన లక్ష్మి, ఆమె ప్రియుడు జాల రాందాస్పు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసుల కు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి విచారణ అధికారి మెదక్ రూరల్ సీఐ పి.రాజశేఖర్ సమగ్ర విచారణ జరిపి సాక్ష్యాధారాలను సేకరించి నిందితులపై కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
ప్రస్తుత విచారణ అధికారి మెదక్ రూరల్ సీఐ జార్జ్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.వెంకటేష్ తన వాదనలను వినిపించారు. లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ విఠల్, సీడీఓలు రవీందర్ గౌడ్, యండి గౌస్ విచారణలో సహకరించారు. పూర్తి సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి నీలిమ నిందితులను దోషులుగా తేల్చి జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధించినట్లు తెలిపారు.