4 August, 2026 | 12:20 PM

ఘనంగా ఆచార్య బాలకృష్ణ జన్మదిన వేడుకలు

04-08-2026 10:59 AM

ముకరంపుర,(విజయక్రాంతి): ఆచార్య బాలకృష్ణ పుట్టినరోజును  పురస్కరించుకుని భారత స్వాభిమాన్ ట్రస్ట్, పతంజలి యోగ సమితి, యువభారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో నగర మేయర్  కొలగాని శ్రీనివాస్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం యోగ సాధకులకు ఔషధ మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఔషధ మొక్కలు, యోగాభ్యాసం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దేవసాని సరస్వతి సత్యనారాయణ, కార్పొరేటర్లు మాసం గణేష్, తాటి ప్రభావతి, యోగ నిర్వాహకులు ముత్యాల రమేష్, యోగ కమిటీ సభ్యులు, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు.