పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని కురుస్తున్న భారీ వర్షానికి పోచారం ప్రాజెక్టు ఎక్కువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు వచ్చి పోచారం ప్రాజెక్టులోనికి చేరుతుంది. లింగంపేట్ ప్రధాన వాగు ద్వారా సుమారు 2150 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు. పోచారం ప్రాజెక్టు 1.820 టీఎంసీల సామర్థ్యం కలదు. ప్రస్తుతం 21 అడుగులకు పోచారం ప్రాజెక్టు నీటిమట్టం చేరి అలుగు పొంగి పొర్లుతుంది.
పోచారం ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ పంటలకు ఎలాంటి డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో పొంగిపొర్లడంతో ఇరిగేషన్ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు పర్యవేక్షణ ముమ్మరంగా చేపడుతున్నారు. ప్రాజెక్టు సమాచారాన్ని ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు అందజేస్తున్నారు.
పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో నీటి విడుదలపై ఉన్నత అధికారులకు నివేదిక అందజేయడం జరిగిందని డిఈఈ కిష్టయ్య తెలిపారు. అటు లింగంపేట్ పెద్దవాగు ద్వారా నీటి ప్రహారం భారీగా పోచారం ప్రాజెక్టులోకి తరలివస్తుంది. పోచారం ప్రాజెక్టు పొంగిపొర్లతో ప్రవాహం మంజీరా నదిలోకి దిగువకు వెళ్తుంది. మంజీరా నది తీర ప్రాంతాల ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ డిఈఈ కిష్టయ్య తెలిపారు.






