నకిలీ ఎన్‌వోసీ కాలేజీలపై చర్యలు
- 52 కాలేజీలకు భారీ జరిమానా
- ఒక్కో కళాశాలకు రూ.8 లక్షల చొప్పున ఫైన్!
హైదరాబాద్, ఆగస్టు7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఫైర్ నకిలీ ఎన్‌వోసీల వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. నిబంధలను ఉల్లంఘిస్తూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేస్తూ ఫైర్ ఎన్‌వోసీలు సమర్పించిన కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. నకిలీ/బోగస్ ఫైర్ సేఫ్టీ ధ్రువపత్రాలను (ఫైర్ ఎన్‌వోసీ) సమర్పించిన ప్రతి ప్రైవేట్ కాలేజీపై జరిమానా విధించాలని తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఒక్కో కాలేజీపై రూ.8 లక్షల చొప్పున జరిమానా విధించా లని అధికారులు నిర్ణయించినట్లుగా బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. తొలుత 8 కాలేజీలే ఫైర్ నకిలీ ఎన్‌వోసీలను సమర్పించినట్లుగా తేలింది. ఆ తర్వాత హైడ్రా, ఇంటర్ బోర్డు, పోలీసు ఉన్నతాధికారుల చేపట్టిన విచారణ నేపథ్యంలో మొత్తం 52 కాలేజీలు ఉన్నట్లుగా గుర్తించారు.
ఇప్పుడు ఈ కాలేజీలన్నింటికీ జరిమానా విధించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. వీటితోపాటు ఇంకేమైనా కాలేజీలున్నాయా? గతంలోనూ ఇలా చేశారా? దీని వెనుకాల ఇంకెవరు ఉన్నారనే విచారణను అధికారులు లోతుగా జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.






