8 August, 2026 | 1:18 AM

లయన్స్ క్లబ్‌లో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు

08-08-2026 12:00 AM

బోధన్, ఆగస్టు 7 (విజయ క్రాంతి): ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని లయన్స్ క్లబ్ హాల్లో అంగన్వాడీ టీచర్లకు అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి, సీడీపీఓ నందిని, డిప్యూటీ డీఎంహెచ్వో డా. విద్య ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం అత్యంత ముఖ్యమని, పుట్టిన తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అదనంగా నీరు లేదా ఇతర ఆహారం అవసరం లేదని తెలిపారు.

తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారాన్ని అందించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచి అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయని వివరించారు. అలాగే తల్లిపాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, తల్లి-శిశువు మధ్య భావోద్వేగ బంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అంగన్వాడీ టీచర్లు విస్తృతంగా అవగాహన కల్పించాలని, ప్రతి శిశువుకు తల్లిపాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది, లయన్స్ క్లబ్ సభ్యులు  పాల్గొన్నారు.