calender_icon.png 21 November, 2025 | 2:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామపురం కాలనీలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం

21-11-2025 02:54:50 PM

పూర్తి స్థాయి సర్వే ద్వారా ఆక్రమణల గుర్తింపు

పార్కులు, ప్రార్థన స్థలాలు, అంతర్గత రహదారుల కబ్జాలపై ఎమ్మెల్యే జిఎంఆర్ తీవ్ర ఆగ్రహం

జిహెచ్ఎంసి, నీటి పారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష

త్వరితగతిన ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలు

పటాన్ చెరు:  పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీలో చోటు చేసుకుంటున్న భూమి ఆక్రమణలపై పూర్తిస్థాయి సర్వే నిర్వహించి, కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) తెలిపారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిహెచ్ఎంసి, రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రెండు దశాబ్దాల క్రితం పటాన్ చెరు డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీతారామపురం కాలనీలో  గత కొన్ని సంవత్సరాలుగా అంతర్గత రహదారులు, పార్కులు, ప్రార్థన స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదులు చేయడం జరిగిందని తెలిపారు.

కాలనీని ఏర్పాటు చేసిన డెవలపర్లు ప్రభుత్వానికి రిజిస్టర్ చేయవలసిన రహదారులు, ప్రార్థన స్థలాలు, పార్కుల స్థలాలను సైతం బై నెంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని తెలిపారు. చివరకు కాలనీ సరిహద్దులలో గల చెరువులు, కాలువలను సైతం ఆక్రమించి ప్లాట్లు అభివృద్ధి చేస్తున్నారని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. 1998వ సంవత్సరంలో మొదటి లేఔట్ తో ప్రారంభించి నేటి వరకు మూడు లేవుట్లుగా తయారు చేయడం జరిగిందని తెలిపారు.  రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తి అవకాశాలు ఉన్నందున  పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలపై ఉక్కు పాదం మోపాలని  అధికారులను ఆదేశించారు. కబ్జాలకు కారకులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని సూచించారు.  ఈ సమావేశంలో ఎమ్మార్వో రంగారావు, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, నీటి పారుదల శాఖ డిఈ రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.