05-01-2026 06:01:54 PM
కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బాధితులు
హనుమకొండ,(విజయక్రాంతి): తమపై దౌర్జన్యం చేస్తున్న మహిళపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ గుండ్ల సింగారం గ్రామానికి చెందిన బౌతు అన్నపూర్ణ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అన్నపూర్ణ తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండ గుండ్ల సింగారం సర్వే నెంబర్ 175 లోని ప్లాట్ నెంబర్ 22ను తమ 2017లో కటకం కవిత దగ్గర కొనుగోలు చేసి దానిలో ఇల్లు నిర్మించుకున్నామని దాని పక్కనే ఉన్న ఫ్లాట్ నెంబర్ 26 ఖాళీగా ఉండేది దానిని ధార సీత కొనుగోలు చేసి అప్పటి నుండి తన కొనుగోలు చేసిన స్థలంలోని కొంత భాగం తమ ఇంటి లోపల ఉంది అని దౌర్జన్యం చేస్తూ గొడవకు దిగుతుందని ఆరోపించారు.
ఇదే విషయమై గతంలో తహసిల్దార్ కు ఫిర్యాదు చేయగా వారు వచ్చి సర్వే చేసి హద్దులు నిర్ణయించారని కానీ హద్దులు కరెక్ట్ కాదు అని మళ్లీ తమ పహారి గోడను కూలగొట్టి తమ ఇంటి లోపల పిల్లర్ వేసిందని అన్నారు. తాము భయభ్రాంతులకు గురై డయల్ 100కు కాల్ చేయగా పోలీసులు వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వినకుండా తమపై బెదిరింపులకు దిగుతుందని అన్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో విచారణ చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్న మహిళపై తగు చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ ను కోరారు.