భావితరాల కోసమే.. భూ బదలాయింపు
హిల్ట్ పాలసీ
పర్యావరణాన్ని బాగుచేయడమే ప్రధాన లక్ష్యం
- ఓఆర్‌ఆర్ వెలుపలికి కాలుష్య కారక పరిశ్రమలు
- పారదర్శకంగానే హిల్ట్ పాలసీ అమలు
- రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచించాలి
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి) : స్వచ్ఛమైన గాలి, వాతావరణాన్ని సృష్టించి భావితరాలకు మంచి భవిష్యత్‌ను అందించే లక్ష్యంతోనే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రూపొందించామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. పర్యావరణాన్ని బాగుచేయడమే ప్రధాన లక్ష్యంగా పాలసీ అమలు చేస్తున్నామని వెల్లడించారు. టెక్నాలజీలో దూసుకుపోతున్నప్పటికీ ప్రతి జీవికి ప్రాథమిక హక్కులైన గాలిని, నీటిని, ఆహారాన్ని కూడా స్వచ్ఛం గా అందించలేని ఒక అసమర్థ నాగరికతలో ఉన్నామనే చేదు నిజాన్ని మాత్రం మనం గుర్తించడం లేదన్నారు.
బహుళ వినియోగ మండలాలను మార్చడమే మా లక్ష్యమని తెలిపారు. 60 ఏళ్ల క్రితం 21 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల్లో పారిశ్రామిక భూమి విస్తరించి ఉందన్నా రు. అందులో స్వతంత్ర పారిశ్రామిక భూములు పోను, 50 శాతం ప్లాటెడ్ భూములున్నాయని పేర్కొన్నారు. ‘హిల్ట్’ పాలసీ విషయంలో మా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోందని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు.
ఈ పాలసీ కింద కన్వర్ట్ చేసే భూములు ప్రభుత్వానికి చెందినవి కావని, ఆ భూములు పరిశ్రమల యజమానులవేనని, ఆ ల్యాండ్స్‌పై హోల్ అండ్ సోల్ రైట్స్ వారివే కాగా, ఈ విషయంలో పనిగట్టుకుని బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ పాలసీ కింద భూముల కన్వర్షన్ ‘స్వచ్ఛందం’ మాత్రమేనని, తప్పనిసరి కాదన్నా రు. ప్రభుత్వం ఎవర్నీ బలవంతపెట్టదని, ఎవరిపై ఒత్తిడి తీసుకురాదని స్పష్టం చేశారు.
పైగా ఇది కాలపరిమితితో కూడుకున్న పాలసీ అని, తమ భూములను కన్వర్షన్ చేసుకోవాలనుకునే పరిశ్రమల యజమానులు 6 నెలల్లోపు ‘టీజీ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. నిపుణులతో చర్చించిన తర్వాతే.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలోని కేబినేట్ సబ్ కమిటీ ఈ ‘హిల్ట్’ పాలసీని రూపొందించిందని, నిబంధనల మేరకు అందరిని సంప్రందించిన తర్వాతే కన్వర్షన్ ఫీజును నిర్ణయించామని తెలిపారు.
కాలుష్య కారక పరిశ్రమలను తరలించిన తర్వాత అక్కడ ఏదో చేస్తారంటూ మాపై కొందరు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని, ఎవరెన్ని విమర్శలు చేసినా మేం వెనక్కి తగ్గబోమని, ప్రజలకు మంచి చేయడం ఆపబోమని తేల్చి చెప్పారు. ఆ స్థలాలను వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగడప డేలా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. చాలా పారిశ్రామిక ప్రాంతాల్లో ఖాయిలా పడ్డ పరిశ్రమలు, మూతపడిన పరిశ్రమల వల్ల ఆ స్థలాలు నిరుపయోగంగా ఉన్నా యని, అలా వృథాగా మారిన స్థలాలను పునర్వియోగంలోకి తేవడమే లక్ష్యమని తెలిపారు.
కొన్ని పరిశ్రమలు ఇంకా కాలం చెల్లిన టెక్నాలజీనే వినియోగించడంతో పరిసరాల్లో కాలుష్యం పెరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతోనే ఈ పాలసీని రూపొందిం చామని పేర్కొన్నారు. మంగళవారం హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చ లో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.
హైదరాబాద్ కూడా ఢిల్లీ మారడం ఖాయం..
నగరంలోని చాలా ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన ‘హెవీ మెటల్స్’ స్థాయిలు ఉండాల్సిన దాని కంటే 1,000 శాతం ఎక్కువగా ఉన్నాయని, పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాల్లో ‘జెనెటిక్ మ్యుటేషన్స్’ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే పలు సైంటిఫిక్ స్టడీస్ తేల్చాయని వివరించారు. ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ‘హైదరాబాద్’ కూడా ఢిల్లీలా మారడం ఖాయమని తెలిపారు.
దానికి ఎంతో దూరం లేదని ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే స్పష్టమవుతోందన్నారు. అప్పుడు ప్రతి ఇల్లూ ఒక ఆసుపత్రి అవుతుందని, పిల్లలకు బొమ్మలు, బుక్స్ కొనిపించినట్లుగానే నెబ్యులైజర్లు, ఇన్‌హేలర్లు కూడా తప్పనిసరిగా కొనివ్వాల్సి వస్తోందన్నారు. అందుకే హిల్ట్ పాలసీపై రాజకీయాలను పక్కన పెట్టి ఆలోచించాలని సూచించారు. లండన్‌లో తీసుకున్న క్లీన్ ఎయిర్ యాక్ట్ వంటి కఠిన నిర్ణయం వల్లే ఒకప్పుడు మురికిగా, విషతుల్యంగా ఉన్న థేమ్స్ నది నేడు అత్యంత స్వచ్ఛంగా మారిందన్నారు.
‘లండన్ తన తప్పుల నుంచి నేర్చుకుని తనను తాను పునర్నిర్మించుకుందని, అదే స్ఫూర్తితో మన మూసీ నదిని కూడా పునరుజ్జీవింపజేసి, భావితరాలకు ఓ జీవనదిగా అందించాలన్నదే మా తాపత్రయమని స్పష్టం చేశారు. చైనాలో చేపట్టిన బ్లూ స్కై ప్రొటెక్షన్ ప్లాన్‌తో ఐదేళ్లలోనే అక్కడి మెగా సిటీస్‌లో 30 శాతం నుంచి 40 శాతం వరకు కాలుష్యం తగ్గిందన్నారు. మన రేపటి భాగ్యనగరం కోసం రాజకీయాలను పక్కనపెట్టి అందరం ఏకమై కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించలేమా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
శస్త్ర చికిత్సే హిల్ట్ పాలసీ..
ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారుచేస్తూ రూ. కోట్లు ప్రాఫిట్ సంపాదిస్తున్నారని, కానీ అదే ఫ్యాక్టరీ వదిలే విష వాయువుల వల్ల చుట్టుపక్కల ఉన్న సామాన్యులు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పారిశ్రామికవేత్తలు చేసే వ్యాపారాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని, కానీ వారు ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నదే మా ప్రభుత్వ పాలసీ అని స్పష్టం చేశారు.
పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఓఆర్‌ఆర్ అవతల కల్పిస్తామని, మీ సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నేడు హైదరాబాద్ ఒక ‘ఎకోలాజికల్ ఇంబాలెన్స్’లో ఉందని, దానిని సరిదిద్దే శస్త్రచికిత్సే హిల్ట్ పాలసీ అని తెలిపారు.
కాలుష్యం చేసేవాడే దాని శుద్ధికి ఖర్చు భరించాలని, కానీ నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యానికి ప్రజలు తమ ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తున్నారని, ఈ అసమతుల్యతను తొలగించడమే హిల్ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. కానీ దీనిపై అవగాహన లేకుండానే కొందరు కావాలని పనిగట్టుకుని ‘పాలసీ’ బయటకు రాక ముందే మాపై విమర్శలు చేయడం మొదలు పెట్టారని, ఇప్పటికీ అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉన్నారు. బాధ్యత లేకుండా దుష్ప్రచారం చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రహస్య స్నేహం..
బీఆర్‌ఎస్ నాయకులైతే ప్రభుత్వం భూములను తక్కువ ధరకే మేం అమ్మేస్తున్నామంటూ మాపై బురద చల్లడం ప్రారంభించారని, ఈ విషయంలో బీఆర్‌ఎస్ బాటలోనే బీజేపీ నాయకులు కూడా నడిస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయంలో కూడా ఈ రకమైన పాలసీ చేశారని, అప్పుడు బీజేపీ నాయకులు ఎందుకు ఆరోపణలు చేయలేదని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్, బీజేపీకి ఉన్న రహస్య స్నేహం ఏమిటని నిలదీశారు.
లీజ్ ల్యాండ్స్ (ప్రభుత్వానికి పూర్తిస్థాయి హక్కులు కలిగిన భూములు.. లీజ్ వ్యవధి 99 ఏళ్లు మాత్రమే)పై ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రీ హోల్ రైట్స్‌ను కల్పించేందుకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 29- జీవో 19ను తీసుకొచ్చిందని, ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులను కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ జీవో వెనుక మతలబు ఏంటని, దీనిపై బీఆర్‌ఎస్ నాయకులు ఎందుకు మాట్లడటం లేదని మండిపడ్డారు.
అంతకు ముందే ‘గ్రిడ్’ పాలసీ పేరిట ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తలకు ధారాదత్తం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించిందని, మరి ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్న బీజేపీ నాయకులు అప్పుడు ఎక్కడికెళ్లారు..? ఎందుకు మాట్లాడలేదని, మీ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తానా ఏంటని ప్రశ్నించారు. ‘హిల్ట్’ పాలసీపై ఏదో చేద్దామనుకుని బీఆర్‌ఎస్ నాయకులు ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో ఫీల్ విజిట్‌కు వెళ్లి పరిశ్రమల యజమానులు, అసోసియేషన్ నాయకుల స్పందన చూసి అవాక్కయ్యారని, మేం కోరితేనే ప్రభుత్వం ఈ పాలసీని తీసుకొచ్చిందంటూ సమాధానం ఇచ్చిన తర్వాత ఏం చేయాలో వారికి పాలుపోలేదని ఎద్దేవా మంత్రి చేశారు.
ఓ చారిత్రాత్మక మార్పు..
అభివృద్ధి కోరుకోవడంలో తప్పు లేదని, కానీ అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి మనం ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నామా అని మంత్రి ప్రశ్నించారు. మన పూర్వీకులు మనకు అందించిన స్వచ్ఛమైన పర్యావరణాన్ని బాధ్యతగా రేపటి తరానికి అంస్తున్నామా అని ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడదని, పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే మన బిడ్డలకు మనమే ‘బంగారు గిన్నె’లో ‘విషం’ ఇచ్చి తాగమన్నట్టు ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మనం ఈ భూమికి కేవలం ధర్మకర్తలం మాత్రమేనని, మన ఫ్యూచర్ జనరేషన్స్‌కు ‘క్లీన్ ఎన్విరాన్ మెంట్’ను అందించడమనేది అత్యవసరమన్నారు. మనం ఇలాగే పర్యావరణాన్ని విధ్వంసం చేసుకుంటూ పోతే... రేపు మన పిల్లలు ఒక ‘ఎకోలాజికల్ డెసర్ట్’లో బతకాల్సిన దుస్థితి ఏర్పడుతుందనేది మనం తప్పకుండా అంగీకరించాల్సిన చేదు నిజమని తెలిపారు. చరిత్రలో గొప్ప మార్పులన్నీ ఒకే ఒక్క అడుగుతోనే మొదలయ్యాయని, ఎవరో ఒకరు.. ఏదో ఒక చోట.. ఎప్పుడో ఒకప్పుడు.. అభివృద్ధి పేరిట జరుగుతున్న ఈ విధ్వంసాన్ని ఆపడానికి అడుగుముందుకు వేయాలని, అది ఇప్పుడే తెలంగాణలో చేసేది మేమే ఎందుకు కాకూడదని అన్నారు.
అందుకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం ఆ చారిత్రక బాధ్యతను భుజానికెత్తుకుందన, రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం మేము ‘హిల్ట్’ పాలసీ పేరిట ఓ చారిత్రాత్మక మార్పు వైపు మొదటి అడుగు వేశామన్నారు. అయినా కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
‘భూమి వినియోగం మారుతోంది, పారిశ్రామిక ప్రాంతం కాస్తా నివాస ప్రాంతంగా మారుతోంది’ అనే రెవెన్యూ రికార్డుల కోణంలో మాత్రమే చూస్తున్నారని, కానీ ఇది రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఒక ‘ఆరోగ్యకరమైన పునాది’ అని స్పష్టం చేశారు. పరిశ్రమలను ఓఆర్‌ఆర్ అవతలికి తరలించి రేపటి తరాలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే మా సంకల్పమని వెల్లడించారు.
పెను ప్రమాదానికి దారి తీస్తుంది..
గతంలో బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి వంటి ప్రాంతాలను కేవలం పరిశ్రమల కోసమే ‘ప్రత్యేక జోన్లు‘గా కేటాయించారని, అప్పట్లో ఇవి నగరం చివర, జనావాసాలకు కిలోమీటర్ల దూరంలో, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఉండటంతో పరిశ్రమల వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండేది కాదన్నారు. కానీ ఈ 50 ఏళ్లలో హైదరాబాద్ నగరం మనం ఊహించని విధంగా, ప్రపంచపటంలో ఒక మహా నగరంగా విస్తరించిందన్నారు.
ఎక్కడో ‘అవుట్ స్కర్ట్స్’లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు, నేడు నగరానికి ‘నడిబొడ్డు‘గా మారిపోవడంతోపాటు అప్పట్లో పరిశ్రమల కోసం కేటాయించిన చోట నేడు లక్షలాది కుటుంబాలు నివసించే రెసిడెన్షియల్ కాలనీలు వెలిశాయని గుర్తు చేశారు. నాడు ఫ్యాక్టరీకి, మన ఇంటికి మధ్య కిలోమీటర్ల దూరం ఉండేదని, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉందన్నారు. ఫ్యాక్టరీ చిమ్నీ నుంచి వచ్చే విషపూరిత పొగ గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా, నేరుగా బెడ్ రూముల్లోకి ప్రవేశిస్తోందని తెలిపారు.
నివాస గృహాలు, పరిశ్రమలు మధ్య ’బఫర్ జోన్’ అంటూ లేకుండా పోయిందని, ఇది కేవలం ప్లానింగ్ లోపం కాదు.. ఒక పెను ప్రమాదానికి బహిరంగ ఆహ్వానం పలకడమేనని స్పష్టం చేశారు. భోపాల్ గ్యాస్ లీకేజీ, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలు ప్రమాదాలకు సజీవ సాక్ష్యాలని ఉదాహరించారు. జపాన్‌లో పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల ఒక తరం మొత్తం నరాల వ్యాధులతో అంగవైకల్యానికి గురైందని, హైదరాబాద్ పారిశ్రామిక బెల్ట్‌లోని భూగర్భ జలాల పరిస్థితి దానికి తీసిపోని విధంగా ఉందన్నారు.
బొల్లారం ఐడీఏపై అనుమానాలొద్దు !: మంత్రి దుద్దిళ్ల
బొల్లారం ఐడీఏపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, బొల్లారం ఐడీఏ కూడా జీవో ప్రకారం ప్రభుత్వ ఇండస్ట్రియల్ ఎస్టేట్, ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలోకే వస్తుందని తేల్చిచెప్పారు. తమ ప్రభుత్వం ఐడీఏ బొల్లారాన్ని వదిలిపెట్టిందనే విమర్శలు అర్థరహితమని పేర్కొన్నరు. సబ్ కమిటీ సమావేశ వివరాలను పబ్లిక్ డోమైన్‌లో ఉంచలేమని, పారిశ్రామికవేత్తలు ఇక్కడి నుంచి వెళ్తే నష్టపోతామని వివరించిన నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌వో ధరలు తీసుకుంటామని వివరించారు. రాష్ట్రానికి రాబడులు, మంచి పేరు రాకూడదని కుట్రపూరితంగా కొందరు కోర్టులో పిల్ వేశారని ఆరోపించారు.
ఈ అంశంపై కోర్టు ఇప్పటికే రాష్ట్రం నుంచి వివరణ కోరిందని గుర్తుచేశారు. తమ ఉద్దేశాన్ని కోర్టుకు తెలియజేస్తామని తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక భూములను తిరిగి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరామని తెలిపారు. పెట్టుబడి దారులకు నమ్మకం కలిగించే తమ ప్రభుత్వం దావోస్ నుంచి మొదటి సంవత్సరంలో రూ.40 వేల కోట్లు, రెండోసంవత్సరంలో రూ.1.70 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు తీసుకువచ్చామని గుర్తుచేశారు.




