6 May, 2026 | 6:40 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ

06-05-2026 06:09 PM

అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్

వనపర్తి,(విజయక్రాంతి): వరి కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని  అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం వనపర్తి మండలంలోని నర్సింగాయిపల్లి, కిష్టగిరి, నాచహల్లీ,  మేంటేపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలు, మౌలిక వసతులు, రికార్డులను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడా గన్నీ బ్యాగుల (Gunny Bags) సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత రాకుండా నిరంతరం నిల్వలను పర్యవేక్షించాలని పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటవెంటనే సంచుల్లో నింపి నిల్వ ఉంచేందుకు వీలుగా ప్రతి కేంద్రానికి తగినన్ని గన్నీ బ్యాగులను తక్షణమే అందుబాటులో ఉంచాలన్నారు.

కొనుగోలు కేంద్రానికి వచ్చే ధాన్యంలో తాలు, మట్టి  లేకుండా రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని సూచించారు. ఇందుకు ప్యాడి క్లీనర్లను వినియోగించాలని ఈ విషయంలో రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. ధాన్యం త్వరగా క్లీనింగ్ చేయడానికి,  రైతులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఆయా కేంద్రాల్లో అదనపు ప్యాడీ క్లీనింగ్ మిషన్లను  వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు చేసిన ధాన్యం తూకం పూర్తి కాగానే మిల్లులకు తరలించేందుకు వీలుగా సరిపడా లారీలను ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు.ఏ రోజుకారోజు ధాన్యం రవాణా జరగాలని, లారీల కొరత నెపంతో కొనుగోలు ప్రక్రియ నిలిచిపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతం  వచ్చేలా రైతులు తమ ధాన్యాన్ని ఆరబెట్టి, క్లీన్ చేసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని  సూచించారు.