07-10-2025 08:29:15 PM
హన్మకొండ (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి(District Additional Collector Venkat Reddy) మంగళవారం రోజు “స్మృతి వనం – గ్రీన్‌ల్యాండ్ ప్రాజెక్ట్” పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ పోస్టర్‌ను కేర్ అండ్ క్యూర్ సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపకుడు, గ్రీన్‌ల్యాండ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డా. ఆచార్య రవి కుమార్ వెలుదండి రూపొందించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గ్రీన్‌ల్యాండ్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో విస్తృతంగా పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ సమతుల్యతను స్థాపించడం అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ శాఖలతో పాటు ప్రజల సహకారం కూడా అత్యవసరమని ఆయన అన్నారు. మీ మొక్కతో వరంగల్ భవిష్యత్తు అనే నినాదంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ద్వారా పౌరుల్లో పర్యావరణ అవగాహనను పెంపొందించి, భవిష్యత్తు తరాల కోసం హరిత భవిష్యత్తు నిర్మించడమే లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా డా. ఆచార్య రవి కుమార్ వెలుదండి మాట్లాడుతూ, ఒక మొక్కను నాటడం అంటే ఒక ప్రాణాన్ని సృష్టించడం. ప్రతి పౌరుడు హరిత వరంగల్ నిర్మాణంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో ‘స్మృతి వనాలు’ ఏర్పాటు చేయబడతాయి. వీటిలో ప్రజలు తమ కీర్తిశేషుల జ్ఞాపకార్థం మొక్కలు నాటే అవకాశం కల్పించబడుతుంది. ప్రాజెక్ట్ నిర్వాహకులు ప్రజలందరినీ తమ వంతు పాత్రగా ప్రతి ఇంటి వద్ద కనీసం ఐదు మొక్కలు నాటాలని, ఈ తరం, రానున్న తరాలకు పచ్చదన వారసత్వాన్ని అందించాలని కోరుకున్నారు.