18-07-2025 12:56:12 AM
సంసద్ టీవీ ఇంటర్వ్యూలో నార్నూర్ బ్లాక్ అభివృద్ధిని వివరించిన కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ప్రధాన మంత్రి ప్రజా పరిపాలనలో అత్యుత్తమ అవార్డు 2024 - ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (ఏబీపీ) కేటగిరీలో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా ఒడిశా రాష్ర్టం భువనేశ్వర్ లో ఈనెల 17,18 తేదీలలో జరుగుతున్న ప్రధాన మంత్రి అవార్డుల ద్వారా గుర్తింపు పొందిన ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం (సెషన్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం కేటగిరీలో అవార్డులు పొందిన ఇతర జిల్లాల కలెక్టర్ లు, అధికారులు పాల్గొని, తమ ఉత్తమ చర్యలను, విజయ రహస్యాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నార్నూర్ బ్లాక్ అభివృద్ధి ప్రయాణాన్ని కలెక్టర్ రాజర్షి షా వివరించారు. బ్లాక్ అభివృద్ధిలో ఉపయోగించిన పాఠాలను, అనుభవాలను ఇతర జిల్లాల అధికారులతో పంచుకున్నారు.
నార్నూర్ బ్లాక్ లో ఆరోగ్యం, విద్య, పోషణ, వ్యవసాయం, ఉపాధి, మౌలిక వసతులు వంటి రంగాలలో ముఖ్య పని తీరు సూచికలులో సాధించిన గణనీయమైన పురోగతిని వివరించారు. ముఖ్యంగా లక్ష్యిత వ్యూహాలు, డేటా ఆధారిత పరిపాలన, శాఖల సమన్వయం, ప్రజాకేంద్రిత విధానాలు వంటి అంశాల ద్వారా నార్నూర్ బ్లాక్ లో సామాజిక-ఆర్థిక సూచికల్లో సాధించిన పురోగతిని హైలైట్ చేశామన్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా సంసద్ టీవీ లో ప్రసారమయ్యే ప్రతిష్ఠాత్మకమైన ‘అభినవ పహల్ 3.0’ సిరీస్ ప్రోగ్రాంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు.