21 August, 2026 | 1:41 AM

మేడిపల్లిలో కల్తీ మసాలాలు

21-08-2026 12:00 AM
  1. శ్రీనివాస్ నగర్ కాలనీలో సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్..
  2. అపరిశుభ్ర వాతావరణంలో మసాలాల తయారీ
  3. కారంపొడిలో 30 శాతం రంపపు పొట్టు 
  4. డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్‌తో దుకాణాలకు సరఫరా
  5. 25 లక్షల సరకు పట్టివేత, ఇద్దరి అరెస్టు

మేడిపల్లి, ఆగస్టు 20 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కల్తీ మసాలాల తయారీ కేంద్రంపై ఎస్వోటీ పోలీసులు, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీం అధికారులు గురువారం దాడులు చేసి, రూ.25 లక్షల విలువైన కల్తీ మసాలలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మేడపల్లి పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌లో అపరిశుభ్ర వాతావరణంలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలాలను తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కారం పొడిలో ఏకంగా 30 శాతం రంపపు పొట్టు కలుపుతున్నట్లు బయటపడింది. ప్రముఖ బ్రాండ్‌ను పోలి ఉండేలా స్వస్తిక్ డిష్ పేరుతో డూప్లికేట్ లేబుల్స్, ప్యాకింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని వివిధ దుకాణాలు, వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.

దాడిలో 2,300 కిలోల పసుపు, 3,350 కిలోల కారం, 5,140 కిలోల ధనియాల పొడి, 100 కిలోల గరం మసాలా స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.