11-07-2025 01:08:31 AM
పేదల బతుకులకు చెల్లుచీటి రాస్తున్న కృత్రిమ కల్లు
రాష్ట్రవ్యాప్తంగా 4,064 సొసైటీలు.. 4,697 కల్లు విక్రయ కేంద్రాలు
ఉమ్మడి రాష్ట్రంలో కల్లు విక్రయ కేంద్రాలు మూసివేత
2018లో తిరిగి ప్రారంభించిన కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణలో తాటిచెట్టు కల్పవృక్షం వంటిది. తాటి కల్లు శరీరానికి అనేక పోషకాలను అందిస్తుందని చెబుతారు. రాష్ట్రంలో ఇప్పుడు తాటి, ఈత వనాలు తగ్గాయి.. కల్లుతీసే గీత కార్మికుల సంఖ్య కూడా తగ్గింది. గతంలో ఒక గ్రామంలో సుమారుగా 100 ముస్తాదులు (కల్లు గీత కార్మికులు) ఉంటే.. ఇప్పుడు వారి సంఖ్య 20 నుంచి 30కి పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రసాయనాలతో తయారు చేసిన కల్తీ, కృత్రిమ కల్లు పుట్టుకొచ్చింది. లెక్కలేనన్ని కల్లు కాంపౌండ్‌లు వెలుస్తున్నాయి. రోజంతా కాయ కష్టం చేసి.. పొద్దుగూకిన తర్వాత ఉపశమనం పొందేందుకు సేవిస్తున్న కల్తీ కల్లుతో పేదల బతుకులు గాల్లో కలుస్తున్నాయి. కల్తీ కల్లు సేవించడం వల్ల విషాద ఘటనలు జరిగినప్పుడు మాత్రమే స్పందిస్తున్న అబ్కారీశాఖ, ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. కల్లు డిపోల నుంచి వచ్చే మామూళ్లు అబ్కారీ శాఖను మత్తెక్కిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కల్లు దుకాణాలకు లైసెన్సులు జారీ చేసి ఎక్సైజ్ శాఖ చేతులు దులుపుకుంటున్నది. తనిఖీలు చేయడం మర్చిపోతున్నది.
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తాటిచెట్టు పైన కల్లు తీసి.. ఆ చెట్టు కిందనే కల్లు విక్రయించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ట్రీ ఫర్ ట్రేడ్ లైసెన్స్ ఇస్తుంది. కానీ ఆ లైసెన్స్‌ను ఆధారంగా చేసుకుని కొంతమంది వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా కల్లు తయారీ కేంద్రాల నుంచి కల్లు తీసుకెళ్లి ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కల్లు విక్రయానికి డిమాండ్ ఉండటంతో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కల్తీ కల్లు తయారీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి.
ఒక్క తాటిచెట్టు కూడా కనిపించని హైదరాబాద్‌లోనే 100కు పైగా కల్లు విక్ర యకేంద్రాలు ఉన్నాయి. ఇలా లెక్కకు మించిన కల్లు దుకాణాలకు ఎక్సైజ్ శాఖ లైసెన్స్‌లు జారీ చేస్తోంది. ఆ తర్వాత ఏ మాత్రం తనిఖీలు చేయడం లేదు. కల్తీ కల్లు కు రోజుకు డిమాండ్ పెరుగుతుండటంతో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కల్లు త యారు చేసే కేంద్రాలు పెరిగాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 4064 సొసైటీలకు గాను 4, 697 కల్లు విక్రయకేంద్రాలు ఉండగా, 1,95, 391 మంది సభ్యులు ఉన్నారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోనే దాదా పు 200లకుపైగా కల్లు విక్రయించే కేంద్రాలున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి పాటు మహబూబ్‌నగర్, నిజామాబాద్ తదితర జిల్లాలలో నిత్యం వేలాది లీటర్ల కల్లు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డితో పాటు నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలోనూ కల్తీ కల్లు దందా కొనసాగుతోంది. ఈ కల్తీ కల్లుకు పేద లు బలవుతున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ అధికారు లకు చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కల్లు విక్రయ కేంద్రాలను ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మూసివేశారు. రాష్ట్ర విభజన తర్వాత కే చం ద్రశేఖర్‌రావు రెండోసారి ముఖ్యమంత్రి అ యిన తర్వాత 2018లో కల్లు విక్రయకేంద్రాలను పునరుద్ధ్దరించారు. దీంతో కల్లు గీత కార్మికుల పేరుతో కొందరు బడాబాబులు సిండికేట్‌గా మారడంతో కల్తీ కల్లు మాఫి యా ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి.
అంతేకాకుండా నగరంతో పాటు రాష్ట్రంలో ని అనేక పట్టణా ల్లో ఒకే కల్లు దుకాణం లైసె న్స్ ఉన్నా, ఎక్కువ దుకాణాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అ బ్కారీ శాఖ నిబంధనల మేరకు ఒక లైసెన్స్‌తో ఒకే దుకాణం నడిపించాలి.. కానీ వ్యా పారులు మాత్రం ఈ నిబంధనను తుంగలో తొక్కుతున్నారు. వీరిపై ఫిర్యాదు చేసినా ప ట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
నిషేధిత మత్తు పదార్థాలతో కల్లు తయారీ..
తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన కల్లు మాత్రమే దుకాణాల్లో విక్రయించాలి. గ్రామీ ణ ప్రాంతాల్లో రోజువారిగా విక్రయించగా మిగిలిన కల్లును డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. ఆ మిగిలిన కల్లును వాహనాల్లో హైదరాబాద్‌కు తీసుకొచ్చే వారు. గతంలో హైదరా బాద్‌కు ఎక్కువగా నల్లగొండ , వరంగల్ తదితర జిల్లాల నుంచి కల్లు సరఫరా జరిగేది. నల్లగొండలోని చౌటుప్పల్, వలిగొండ, చిట్యాల, మునుగోడు తదితర ప్రాంతాల ను ంచి ఎక్కువగా నగరానికి కల్లు వచ్చేది.
ఇప్పు డా పరిస్థితి లేదు. తాటి చెట్ల నుంచి తీసిన క ల్లు లేకుండానే.. నిషేధిత మత్తు పదార్థాలతో కల్లును తయారీ చేస్తున్నారు. అల్ప్రాజోలం మొదలుకోని డైజోపాం, క్లోరో హైడ్రేట్, కుం కుడు కాయలు, యూరియా వరకు కల్లును కల్తీ చేసేందుకు ఉపయోగిస్తున్నారు. గతం లో గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 100 లీటర్ల కల్లు సేకరించి తీసుకొచ్చాక దాన్ని 1000 లీటర్ల కల్లుగా మార్చేవారు. కానీ, ఇ ప్పుడు గ్రామాల నుంచి ఒక లీటర్ కూడా సేకరించకుండానే కృత్రిమ కల్లును తయారు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా లో తాటి చెట్లు లేకపోయినా ఒక్క రోజులోనే 3 లక్షల లీటర్లకు పైగా కల్తీ కల్లు ఉత్పత్తి అవుతోంది. 2,400 సీసాల కల్లు తయారీకి కేవ లం రూ. 7,800 మాత్రమే ఖర్చు అవుతుందని చెబుతున్నారు.
గతంలో జరిగిన కల్తీ కల్లు ఘటనలు..
- 2021 సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం సంగం గ్రామంలో వెంకటేశ్వరస్వామి జాతర సందర్భంగా కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్తతకు గురయ్యారు. నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బోధన్‌లోనే ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
- కూకట్‌పల్లి ఘటనకు మూడు నెలల ముందు.. అంటే 2025 ఏప్రిల్ నెలలో, కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు సేవించడం వల్ల వందమంది వరకు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రిలో చేర్పించి సకాలంలో చికిత్స అందించడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
- 2022లో కరీంనగర్ జిల్లాలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు కల్తీ కల్లు కేంద్రాలపై దాడులు చేసి ప్రమాదకరమైన రసాయనాలను, కల్తీ కల్లును పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు వికారాబాద్ జిల్లాలోనూ కల్తీ కల్లు వ్యాపారం జోరుగా సాగుతోంది. గీత కార్మికుల సంక్షేమానికి పాటుపడాల్సిన కొందరు అధికార పార్టీ నాయకులే.. గీత కార్మికుల అమాయకత్వాన్ని అసరగా చేసుకుని కల్తీ కల్లు వ్యాపారంలో రెచ్చిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
మత్తు పదార్థాలు వల్లే..
సాధారణంగా కల్లులో మత్తు కోసం డైజోపాం, క్లోరో హైడ్రేడ్, తీపి కోసం శాక్రిన్, నురగ కోసం ఆమోనియం కలుపుతుంటారు. కల్లులో నేప్రోటాక్సిన్ అనే నిషేధిత మత్తు పదార్థాలు కలపడం వల్లే కల్లు సేవించిన వ్యక్తులు మృతిచెందుతున్నారు. కండరాలపై ఈ మత్తు పదార్థాల ప్రభావం పడినప్పుడు శరీరంలోకి క్రియాటినైన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందని, దీంతో మూత్రపిండాలు దెబ్బతినడం, గుండె, మెదడు, ఇతర ప్రధానమైన అవయవాలు దెబ్బతింటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెంటనే డయాలసిస్ చేయకపోతే కల్తీ కల్లు సేవించిన వ్యక్తి మరణించే ప్రమాదం ఉంటుంది. ఒంటి నొప్పులతో మొదలై కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుందని, విచక్షణా కోల్పోయి పిచ్చిగా ప్రవర్తిస్తుంటారని వైద్యులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. కల్తీ కల్లు బాధితులకు వైద్య చికిత్స సమయంలో ఇచ్చే మత్తు ఇంజక్షన్లు కూడా పని చేయవని, మోతాదుకు మించి డోస్ ఇవ్వాల్సి వస్తుందన్నారు.