11-07-2025 12:48:40 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): సెలబ్రెటీలు నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగప్ర వేశం చేసింది. యాప్‌లకు ప్రచారం కల్పించినందుకు గాను, టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, యాంకర్లు, సోషల్ మీడి యా ఇన్‌ఫ్లుయెన్సర్లతో సహా మొత్తం 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు నమో దు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా, మనీ లాం డరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఫైల్ చేసింది. ఈడీ కేసు నమోదు చేసిన వారిలో ప్రముఖ సినీ నటులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల వంటి వారు ఉన్నారు.
వీరితో పాటు యాంకర్లు శ్రీముఖి, విష్ణు ప్రియ, వర్షిణి, టీవీ నటులు సిరి హనుమంతు, శోభా శెట్టి, వసంతి కృష్ణన్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు హర్ష సాయి, టేస్టీ తేజ, బయ్యా సన్నీ యాదవ్, నీతూ అగర్వాల్ తదితరులు ఉన్నారు. వీరందరినీ పీఎంఎల్‌ఏ కింద విచారించి, వారి వాంగ్మూలాలను నమోదు చేయనున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు.
నిషేధిత బెట్టింగ్ యాప్‌ల ప్రచారం కోసం నిర్వాహకులు ఈ సెలబ్రిటీలకు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు చెల్లించారని ఆరోపణలున్నాయి. అయితే, ఈ భారీ మొత్తా న్ని చాలా మంది తమ ఐటీ రిటర్న్‌లలో చూపించలేదని, హవాలా మార్గాల్లో డబ్బు లు చేతులు మారాయని ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే మనీ లాండరింగ్ కోణంలో దర్యా ప్తు చేపట్టింది.
సెలబ్రిటీలు తమకున్న ఫాలోయింగ్‌ను ఉపయోగించి, యువతను బెట్టింగ్ ఊబిలోకి దించుతున్నారని ఈడీ అభియోగాలు మోపింది. ఈజీ మనీ ఆశ చూపి యువతను ఆకర్షిస్తున్న ఈ యాప్‌ల వల్ల ఎందరో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు సైతం వాటికి బానిసలై, లక్షల్లో అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
ఈ దారుణాలపై మీడియాలో కథనాలు వెల్లువెత్తడంతో, తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృం దాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను పోలీసులు విచారించారు. తాజాగా ఈడీ కూడా రంగంలోకి దిగడంతో, ఈ బెట్టింగ్ యాప్‌ల ప్రచారకర్తలకు ఉచ్చు బిగుసుకున్నట్టుంది.