calender_icon.png 11 July, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభాకర్‌రావుపై సుప్రీంకు సిట్

11-07-2025 12:55:00 AM

పోయిరావలె హస్తినకు

  1. విచారణకు సహకరించడం లేదని పిటిషన్
  2. ఢిల్లీకి వెళ్లిన డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంకటగిరి
  3. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో, సిట్ అధికారులు ఆయనపై ఉచ్చు బిగించేందుకు ఢిల్లీబాట పట్టారు. ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టు కల్పించిన అరెస్ట్ నుంచి మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో గురువారం జరగాల్సిన విచారణలు వాయిదా పడ్డాయి.. ఇప్పటికే ఐదుసార్లు, సుమారు 40 గంటల పాటు ప్రభాకర్‌రావును సిట్ బృందం విచారించింది. అయితే, ఆయన అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధానమివ్వకుండా, తన పై అధికారుల ఆదేశాల మేరకే అంతా జరిగిందని, వ్యక్తిగతం గా తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెబుతూ విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారని సిట్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదే కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు మాత్రం ప్రభాకర్‌రావు ఆదేశాల తోనే తాము ఫోన్లు ట్యాప్ చేశామని వాం గ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో, ఆయన్ను కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే కీలక వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ప్రభాకర్‌రావును ఆగస్ట్ 5వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

దీన్ని అడ్డుపెట్టుకొనే ఆయన విచారణకు సహకరించడం లేదని భావిస్తున్న సిట్, ఈ మినహాయింపును రద్దు చేయాలని తమ పిటిషన్‌లో కోరనుంది. ఇందులో భాగంగానే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, సిట్ అధికారి ఏసీపీ వెంకటగిరి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే సిట్ కీలక అధికారులు ఢిల్లీకి వెళ్లడంతో, గురువారం జరగాల్సిన విచారణలు వాయిదాపడ్డాయి.

ప్రభాకర్ రావు విచారణతో పాటు, 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్‌కు గురైన మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వాంగ్మూలం నమోదును కూడా వాయిదా వేశారు. తదుపరి విచారణ తేదీని త్వరలో ప్రకటించనున్నారు. సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం ఈ కేసు దర్యాప్తులో అత్యంత కీలకం కానుంది.