calender_icon.png 11 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొండంత అండ కోమటిరెడ్డి

11-07-2025 01:01:55 AM

  1. ఉమ్మడి నల్లగొండ జిల్లాపై ఉడుంపట్టు
  2. రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వెంకట్‌రెడ్డి
  3. తెలంగాణ సాధన కోసం మంత్రి పదవి త్యాగం
  4. సామాజిక సేవల్లోనూ మేటి 
  5. కొడుకు ప్రతీక్‌రెడ్డి పేరిట ట్రస్టు ఏర్పాటు

(నల్లగొండ, విజయక్రాంతి): కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఈ పేరుకు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేదు. ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ చరిత్రను సృష్టించారు. ఓవైపు రాజకీయం.. మరోవైపు సామాజిక సేవతో అన్నార్తులు.. అనాథలకు పెద్దదిక్కయ్యారాయన. పేదోళ్లకు అండగా ఉంటూ అర్ధరాత్రి.. అపరాత్రి అనే తేడా లేకుండా సాయమంటూ వస్తే అక్కున చేర్చుకోవడం ఆయన నైజం.

రాష్ట్ర రాజకీయాల్లోనూ కోమటిరెడ్డి  వెంకట్‌రెడ్డి ఎప్పుడూ సంచలనమే. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, అనతి కాలంలోనే యువజన కాంగ్రెస్‌తో తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన వెంకట్‌రెడ్డి తిరుగులేని లీడర్‌గా ఎదిగారు. ఉద్యమాల పురిటిగడ్డ నల్లగొండలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేశాడు. స్వరాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి అధిష్ఠానానికి అల్టిమేటం జారీచేసి అప్పట్లో సంచలనం సృష్టించారు.

పట్నం నుంచి పల్లె దాకా.. ఎవ్వరూ ఎదురుపడ్డా పేరు పెట్టి సొంత మనిషిలా పిలవగలిగేంత ఆత్మీయతను చూపడం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదరణకు నిదర్శనం. మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాను కాంగ్రెస్‌కు కంచుకోటగా మార్చడంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాత్ర అమోఘమని చెప్పొచ్చు.

హ్యాట్రిక్ విజయాలతో మంత్రి పదవి 

వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటంతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. రెండోసారి ముఖ్యమంత్రి అయిన డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన మంత్రివర్గంలో కోమటిరెడ్డికి చోటు కల్పించారు. దీంతో ఐటీ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకు రావడానికి కోమటిరెడ్డి ఎంతగానో కృషిచేశారు.

ఐటీ పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పించాలని ఎంతగానో సంకల్పించారు. అయితే, తెలంగాణా వాదానికి మద్దతుగా తన మంత్రిత్వ శాఖ, తన అసెంబ్లీ స్థానానికి 2010లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. అయితే, 2011 అక్టోబరులో కాంగ్రెస్ ప్రభుత్వం వెంకట్‌రెడ్డి శాసన సభ్యత్వానికి చేసిన రాజీనామాను ఆమోదించడానికి నిరాకరించింది. 

2018లో ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీగా గెలిచి 

ఈ నేపథ్యంలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఐదోసారి నల్లగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మొదటిసారి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి 22 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

అయితే, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భువనగిరి నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నరసయ్యగౌడ్‌పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ సమయంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సమయంలో పీసీసీ చీఫ్‌గా కోమటిరెడ్డికి పదవి వస్తుందని అంతా అనుకున్నా రేవంత్‌రెడ్డికి ఆ పదవి దక్కింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ  స్థానం నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మళ్లీ బరిలోకి దిగి 1,07,405 భారీ మెజార్టీతో కంచర్ల భూపాల్‌రెడ్డిపై గెలుపొందారు. ఈ దఫా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా తనదైన ముద్రవేస్తూ ముందుకుసాగుతున్నారు. 

వ్యవసాయ కుటుంబం నుంచి..

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వస్థలం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణవెల్లెంల గ్రామం. ఆయన 23 మే 1963న సుశీలమ్మ, పాపిరెడ్డి దంపతులకు 8వ సంతానంగా జన్మించారు. వీరిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. వెంకట్‌రెడ్డికి తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 1980లో హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని అమరజీవి పొట్టి శ్రీరాములు ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివారు.

ఆ తరువాత పాతర్‌గట్టి ఎన్బీ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న ప్రఖ్యాత చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో బ్యాచిలర్స్ ఆఫ్ సివిల్ ఇంజినీరింగ్ విద్య అభ్యసించారు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంజినీరింగ్ పూర్తి చేయలేకపోయారు. ఇంజినీరింగ్ చదువుతున్న కాలంలోనే కోమటిరెడ్డి రాజకీయాలకు ఆకర్షితుడయ్యారు.

ఆ రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుని యూత్ కాంగ్రెస్‌లో చేరారు. కాలేజీలో ఉన్న సమయంలోనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలోనే సభితతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు ప్రతీక్‌రెడ్డి, కుమార్తె శ్రీనిధి. కుమారుడు 20 డిసెంబర్ 2011న హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.

జిల్లాలో రూ.5వేల కోట్లతో రోడ్ల విస్తరణ

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో మొత్తం సుమారు రూ.5వేల కోట్లతో రోడ్లకు అనుమతులు మంజూరు చేశారు. జిల్లాలో ప్రతీ మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్రోడ్డు, ప్రతీ గ్రామం నుంచి మండలం కేంద్రానికి బీటీరోడ్డును మం జూరుచేశారు. జిల్లాలోని కీలకమైన రహహదారులన్నింటికీ నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచారు.

చిట్యాల- భువనగిరి రోడ్డును జాతీయరహదారిగా చేపట్టాలని కేంద్రానికి విన్నవించగా, నల్లగొండలో రింగ్రోడ్డుకు రూ.450 కోట్లు కేటాయించారు. అదేవిధంగా రీజినల్ రింగురోడ్డు దక్షిణభాగాన్ని మంజూరు చేయించిన పనులకు శ్రీకారం చుట్టారు. కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులను కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయించారు. మిర్యాలగూడలో నార్కట్పల్లి-అద్దంకి రహదారిపైన నాలుగు చోట్ల అండర్ప్సావేలకు శంకుస్థాపనలు చేశారు. మొత్తంగా రోడ్ల పనులు భారీగా నిధులిస్తుండడంతో జిల్లా రోడ్లకు మహర్దశ పట్టనుంది.

నల్లగొండలో నిరాహార దీక్ష

స్వరాష్ట్రం సాధన కోసం పదవుల త్యాగం చేసిన వెంకట్‌రెడ్డి.. ఆ తరవాత 2011 నవంబర్ 1న నల్లగొండ జిల్లాలో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. తొమ్మిది రోజుల తరవాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అయితే, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం నిరాహార దీక్ష చేపట్టిన తొలి నాయకుడిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గుర్తిస్తారు.

తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిపై 10వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డి గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రతిపక్షనేతగా కోమటిరెడ్డి తన గళం విప్పారు. నిత్యం ప్రభుత్వానితో పోరాడుతూ కంటిమీద కునుకులేకుండా చేశారు.

యూత్ అధ్యక్షుడిగా ప్రస్థానం ప్రారంభం..

నల్లగొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికతో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాటి టీడీపీ ప్రభుత్వ తప్పిదాలపై నిరంతరాయంగా పోరాడారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి కోమటిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సమీప సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై 4 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అప్పటివరకు కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్లగొండను కాంగ్రెస్ అడ్డాగా మార్చడంలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అటు పార్టీని పటిష్ఠం చేస్తూనే తనదైన రీతిలో అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. దీంతో మళ్లీ 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం నల్లేరుపై నడకయ్యింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డిపై 22 వేల భారీ మెజారిటీతో విజయపంథాలో దూసుకుపోయారు.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపట్టి పూర్తిచేశారు. నల్లగొండను దశాబ్దాలుగా పట్టిపీడుస్తున్న తాగునీటి సమస్య తొలగించడానికి ఊరూరా శుద్ధనీటి ప్లాంటులను ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ సంక్షేమ ఫలాలన్నీ పేదలకు అందేలా తనవంతు కృషి చేశారు. ఈ దెబ్బకు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం కైవసం చేసుకున్నారు. ఈ పోరులో మరల తన సమీప ప్రత్యర్థిగా సీపీఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై గెలుపు బావుటా ఎగురవేశారు. 

ప్రతీక్ ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవ

తన కుమారుడు ప్రతీక్ రెడ్డి జ్ఞాపకార్థం కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్‌ను స్థాపించారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. ఈ ఫౌండేషన్ ద్వారా రూ.3.5 కోట్ల వ్యయంతో నల్లగొండలో  ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాల భవనాలను చేపట్టారు. ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సేవలను నిర్వహిస్తున్నారు.

అంతేకాకుండా తన కుమారుడిలా ఎవరు రోడ్డు ప్రమాదాలకు గురవ్వకూడదని, రహదారి భద్రత కోసం అవగాహన కార్యాక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా జాబ్‌మేళాను నిర్వహించి అనేక మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను అందిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాపై కోమటిరెడ్డి అభివృద్ది మార్క్..

  1. రూ.5వేల కోట్లతో జిల్లాలో రోడ్ల విస్తరణ 
  2. ఫ్లోరైడ్ రక్కసిని తరిమేందుకు బ్రాహ్మణ వెల్లంల పూర్తి
  3. స్పెషల్ ఫండ్ వెచ్చించి మెడికల్ కాలేజ్ ఓపెన్

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుణ్యామం టూ కొత్త అభివృద్ధికి పునాదులు పడ్డాయి. ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసేలా ఇరిగేషన్ విధానా న్ని అమల్లోకి తేవడంతో పా టు ఏడాదంతా పలు అభివృ ద్ధి, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఎస్‌ఎల్బీసీ పూర్తికి కార్యాచరణ ప్రకటించగా, డిండి లిఫ్టు, మూసీ కాల్వలకు భారీగా నిధులు ప్రకటించారు.

జిల్లాలోని నకిరేకల్, మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల్లోని ఫ్లోరైడ్ పీడిత ప్రాం తాల్లో లక్ష ఎకరాలకు సాగునీరిచ్చే ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల ఎత్తిపోతల పథకం కల సాకారమైంది. ఫ్లోరోసిస్‌తో బాధపడే తన సొంత గ్రామంతోపాటు మూడు నియోజకవర్గాల్లోని ప్రజల ఇక్కట్లు తీర్చేందుకు 2007లో అప్పటి ఎమ్మెల్యే గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఎమ్మార్పీ ద్వారా బ్రాహ్మణవెల్లంలకు నీ టిని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తిపోతల పథకం ఏ ర్పాటు చేసి తద్వారా ఇక్కడి నుంచి లక్ష ఎకరాలకు నీరివ్వాలనే పథ కానికి రూపకల్పన చేశా రు.

అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని ఒప్పించి ఈ పథకానికి రూ.699కోట్ల నిధులు మంజూరు చేయించడమేకాక అప్ప టి సీఎం వైఎ్సఆర్‌తో శంకుస్థాపన చేయించారు. 2013 వరకు పనులు వేగంగా సాగినా పథకం పూర్తికాలేదు. అనంతరం గత పదేళ్లలో ఈ పథకం ముందుకు సాగలేదు. గత ఎన్నికలకు ముందు పంపుహౌస్, లిఫ్టుల పనులు పూర్తిచేసి ట్రయల్రన్ నిర్వహించి నా, రిజర్వాయర్, కాల్వల పనులు అలాగే ఉన్నాయి.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక ఈ పథకానికి రూ. 100కోట్లు కేటాయించి పెండింగ్ పనులు పూర్తిచేయించి ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. లక్ష ఎకరాలకు నిర్దేశించిన బ్రాహ్మణవెల్లంల, ఉదయసముద్రం ఎత్తిపోతల పథకం కింద మొదటి దశలో 48,972 ఎకరాలకు ఈ ఏడాది నీరిచ్చేందుకు నిర్ణయించారు.

జిల్లాలో 6 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు..

ఉపాధి కల్పనే ధ్యేయంగా ఐటీఐల స్థానంలో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాట్లుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ బాలుర ఐటీఐ, బాలికల ఐటీఐతోపాటు భువనగిరి, ఆలేరు, డిండి, హాలియా, హుజూర్నగర్లలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా రు. ఆరు ఆధునిక కోర్సులతో ఈ సెంటర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.40కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది.

అదేవిధంగా నల్లగొండలో సెట్విన్ సహకారంతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంట ర్ ఏర్పాటు చేయగా, ప్రతీ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులిచ్చారు. వీటితోపాటు స్కూళ్లలో మౌలిక సదుపాయా ల కల్పనకు రూ.48కోట్లు కేటాయించారు. అదేవిధంగా నల్లగొండ, మునుగోడు, హుజూర్ నగర్‌లో ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపనలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చేశారు.

నల్లగొండలో  మెడికల్ కాలేజీ ఓపెన్..

నల్లగొండ జిల్లా కేంద్రంలోని గంధంవారిగూడెం వద్ద 42 ఎకరాల్లో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాల భవనానికి 2022ఆగస్టులో శంకుస్థాపన చేసి పనులు చేపట్టగా, 2024, డిసెంబరు 7వ తేదీన ఈ భవన సముదాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. కళాశాల భవన సముదాయం గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మూడు అంతస్తులు, బాలికల వసతి గృహం గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు అయిదంతస్తులు, బాలుర వసతి గృహం గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు అయిదంతస్తులు నిర్మించారు.

వీటితోపాటు ప్రిన్సిపల్ క్వార్టర్స్ గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మూడు అంతస్తులు నిర్మించారు. క్యాంటిన్ ప్రత్యేకంగా అందుబాటులో ఉంచారు. ప్రహరీ, పార్కింగ్ సదుపాయాలు కల్పించారు. ప్రాంగణమంతా గ్రీనరీ, చెట్లతో కళకళలాడుతోంది. ఇదే ప్రాంగణం లో రూ.400కోట్లతో నర్సింగ్ కళాశాలకు కూడా శంకుస్థాపన చేశారు.

భువనగిరి ఎంపీగా..

* రూ.600 కోట్లతో ఎన్‌హెచ్ ౯౩౦ పీ నిర్మాణానికి కృషి.. గౌరెల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి కొత్తగూడెం వరకు NH 65 యొక్క 4 లేన్లను ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు హైదరాబాద్ నుంచి విజయవాడకు అనుసంధానిస్తుంది. 

* నేత కార్మికుల కోసం జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం కింద రెండు క్లస్టర్ అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేశారు. 

* బీబీనగర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రికి సుమారు రూ.970 కోట్లతో వైద్య సౌకర్యాలు, సంబంధిత పరికరాలను తీసుకురావడానికి చర్యలు తీసుకున్నారు. 

* భువనగిరి పట్టణంలో సుమారు రూ.200 కోట్లతో ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం మంజూరు.

* భువనగిరి పార్లమెంట్ ప్రాంతంలో వందల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు మంజూరు చేయించారు

* బొగ్గు, ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా సింగరేణి కాలరీస్ లిమిటెడ్ ద్వారా ఒడిశాలో ఉన్న నైనా కోల్‌మైన్ అభివృద్ధి, నిర్వహణ కోసం ఎంపిక చేసిన మైన్ డెవలపర్ కమ్ ఆపరేటర్ పనికి దాదాపు రూ.30 వేల కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు ప్రయోజనం చేకూర్చే చర్యలు తీసుకున్నారు. ప్రారంభ టెండర్లను రద్దు చేసి, తరువాత కొత్త టెండర్లను పిలిచి వారి బొగ్గు బ్లాకులను కేటాయించారు. పార్లమెంటులో 341 ప్రశ్నలను లేవనెత్తారు, ఇది తెలంగాణలోని  ఇతర పార్లమెంటేరియన్ కంటే ఎక్కువ.