11-07-2025 12:41:02 AM
శ్రీశైలం మూడు గేట్ల ద్వారా నీటి విడుదల
నాగార్జునసాగర్, జూలై 10: కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నీటి ప్రాజెక్టులు కలకలలాడుతున్నాయి. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. జూరాల ప్రాజెక్ట్‌కు సంబంధించి 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులున్నారు. 1.15 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 1.26 లక్షల క్యూసెక్కుల ఔట్ ఫ్లోగా నమోదవుతున్నది.
జూరాల నుంచి వస్తున్న నీటితో శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండింది. మూడు రేడియల్ క్రస్టు గేట్లు పది అడుగుల మేర ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1,72,829 క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 1,48,625 గా ఉంది. శ్రీశైలం ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉంది.
శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. సాగర్‌కు ఎగువ నుంచి లక్షా 20వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నిలకడగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. సాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 1.20లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4,702 క్యూసెక్కులు నమోదవుతున్నది.
కుమ్రంభీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత
కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి ): రెండు రోజులుగా వర్షాలు విస్తారంగా కురవడంతో ఆసిఫాబాద్ మండలంలోని కుమ్రంభీం ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతున్నది. గురువారం ప్రాజెక్టు అధికారులు రెండు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 5.882 టీఎంసీలుగా ఉన్నది.