calender_icon.png 11 July, 2025 | 7:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మీ మ్యాప్‌లో మా రాష్ట్రం లేదని.. మర్లబడ్డ తెలంగాణ

11-07-2025 01:13:56 AM

గిదేంది బై!

ఏపీ మంత్రి లోకేశ్‌కు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అందించిన భారతదేశ మ్యాప్‌లో తెలంగాణ రాష్ట్రం మిస్సింగ్!

11 ఏండ్లయినా తెలంగాణను ఇంకా గుర్తించరా?

మండిపడుతున్న తెలంగాణవాదులు

మా అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తారా?

బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాల్సిందే

ప్రధాని మోదీని నిలదీసిన బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేశ్ కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ బహూకరించిన భారత చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం లేకపోవ డంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఏర్పడి పదకొండు ఏళ్లు దాటినా కూడా రాష్ట్రంగా గుర్తించకపోవడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ హయాం లో ఏర్పాటు చేసిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ వంటి కొత్త రాష్ట్రాలు చిత్రపటంలో ఉన్నాయని.. అమరవీరుల బలిదానాలు, సబ్బండవర్గాల పోరాటంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆ మ్యాప్ లో లేకపోవడం ఆ పార్టీ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని భగ్గుమంటు న్నారు. తెలంగాణలో ఈ అంశం వి వాదస్పదమై దుమారం రేపుతోంది. తెలంగాణ వాదులు మీడియాలో, సోషల్ మీడియాలో బీజేపీ తీరు ఇదేనా అంటూ విరుచుకుపడుతున్నారు. 

బీజేపీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్

ఈ అంశంపై స్పందించిన కేటీఆర్ ఎక్స్‌లో బీజేపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ ప్రధా ని మోదీని ట్యాగ్ చేస్తూ గురువారం పోస్టు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ టీడీపీ,బీజేపీ నేతలపై డీజీపీ సుమోటోగా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఎక్స్ లో పోస్టు చేస్తూ భారతదేశ చిత్రపటం నుంచి తెలంగాణను తొలగించడంపై వెంటనే బీజేపీ నేత లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ అస్తిత్వాన్ని భౌగోళిక గుర్తింపును గుర్తించక పోవడం బీజేపీ అధికారిక విధానమా అని ప్రధాని నరేంద్ర మోదీని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నరేంద్ర మోదీకి పలు ప్రశ్నలు సంధించిన కేటీఆర్.. ‘దశాబ్దాలపాటు తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు కోసం, చరిత్రలో తమకు సరైన చోటు దక్కడం కోసం, ప్రత్యేక భౌగోళిక గు ర్తింపు, ప్రత్యేక రాష్ర్టం కోసం ఎనలేని పోరాటాలు చేసింది తెలంగాణ గడ్డ.

అయితే మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మా సాంస్కృతిక గుర్తింపుని అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసేలా భారతదేశ చిత్రపటాన్ని ఉపయోగించారని, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్ బహుమతిగా ఇచ్చిన మ్యాపు లో  ఉమ్మడి ఆం ధ్రప్రదేశ్‌ను మాత్రమే చూపించడం దారుణం.. తెలంగాణ రాష్ర్టం అస్తిత్వాన్ని లెక్కచేయకుండా చేసిన చర్య మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఇది పూర్తిగా అనుచితమైంది.

భారతదేశ చిత్రపటం నుంచి మా చరిత్రనే తొలగిస్తే మేమెవ రం? ఇది మీ పార్టీ అధికారిక అభిప్రాయమా?’ అని ప్రధానమంత్రి మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ చర్య కేవలం ఒక పొరపాటా అనే విషయంపై పీఎం మోదీ స్పష్టత ఇవ్వాలని ఆ యన డిమాండ్ చేశారు.

ఇది తెలంగాణ ప్రజల త్యాగాలు, రాష్ర్ట సాధన కోసం చేసిన పోరాటాలను, బలిదానాలను అగౌరవపరచడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా చరిత్రను నిర్లక్ష్యం చేసిన బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలని, పొరపాటైతే తెలంగాణ ప్రజలని అపహాస్యం చేసినందుకు మీ పార్టీ నాయకత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 

సుమోటోగా కేసు నమోదు చేయాలి: దాసోజు శ్రవణ్

 టీడీపీ నేత నారా లోకేశ్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భారతీయ సాంస్కృతిక వైభవం పేరిట ఇచ్చిన చిత్రపటంలో తెలంగాణ మ్యాప్ లేకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమే అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ టీడీపీలు తెలంగాణ ఏర్పాటును ఇంకా గుర్తించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ సెక్షన్ 336, 337ల కింద డీజీపీ తక్షణమే సుమోటోగా కేసు నమోదు చేసి బీజేపీ,టీడీపీ నేతలపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును అడ్డుకున్నారని, తెలంగాణ లేని చిత్రపటాన్ని బీజేపీ నేత ఇవ్వడం టీడీపీ నేత తీసుకోవడం నరనరాల్లో వారికి తెలంగాణ అంటే ఇష్టం లేని తీరును సూచిస్తోందని ఆయన మండిపడ్డారు.

మోదీ కూడా తెలంగాణ ఏర్పాటు గురించి తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని అన్నారని, తెలంగాణ లేని చిత్రపటం ఇవ్వడం అంటే అస్తిత్వంపై దాడిగానే భావించాలని ఆయన ధ్వజమెతారు. ఈ వ్యవహరంపై బండి సంజయ్ ఎందుకు స్పందించరని, సంస్కృతిపై దాడిని ప్రశ్నించకపోతే తెలంగాణ వ్యతిరేకిగానే భావించాల్సి ఉంటుందన్నారు. టీడీపీ తెలంగాణలో ఏదో వెలగబెడతామని అంటున్నారని, కనీసం తెలంగాణ ఉనికిని గుర్తించకుండా ఇక్కడ రాజకీయం ఎలా చేస్తారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.