calender_icon.png 11 July, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హవాలా వల.. చిక్కా‘వా’!

11-07-2025 01:00:08 AM

తస్మాత్ జాగ్రత్త..

  1. పారిశ్రామికవేత్తలే లక్ష్యంగా మోసం
  2. భారీగా రుణం ఇస్తామని ఆశపెట్టి.. లక్షలు కొల్లగొడుతున్న వైనం

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి) : రోజుకో కొత్త రకం ట్రిక్కులతో మోసగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. తాము మోసపోయామని తెలుసుకున్న అమాయకులు.. ఏం చేయాలో తెలియక లోలోపల మదనపడుతున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా ఒక పారిశ్రామికవేత్తకు తక్కువ వడ్డీకే భారీగా రుణం ఇస్తా మని నమ్మబలికి రూ. 25 లక్షలు కొల్లగొట్టిన వైనం వెలుగులోకి వచ్చింది.

పైగా ఈ భారీ రుణం.. హవాలా మార్గంలో అందిస్తామని చెప్పడంతో, ప్రభుత్వానికి టాక్స్ లు కూడా ఎగ్గొట్టవచ్చుననుకున్న సదరు పారిశ్రామికవేత్తకు చివరికి రూ. 25 లక్షలకు కుచ్చుటోపీ పడింది. ఈ మోసాన్ని పోలీసులకు చెబుదామనుకున్నా, తాను ఇచ్చింది నగదు కావడంతో లోలోపల బాధపడటం తప్పితే.. ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నాడు. ఇదీ కథ..

తక్కువ వడ్డీకి.. ఎక్కువ రుణం..

తాజాగా ఒక పారిశ్రామికవేత్త వద్దకు ఒక కన్సల్టెంట్ వచ్చాడు. తాను నడిపిస్తు న్న ఫ్యాక్టరీని మరింతగా అభివృద్ధి చేసేందుకు వీలుగా కావాల్సిన రూ. 50 కోట్ల రుణం ఇవ్వడానికి కొందరు రుణదాతలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పైగా 9 శాతం వడ్డీకే ఈ రుణం అందుతుందని.. అదీగాక.. నిబంధనలుకూడా సులువుగా ఉంటాయని, ఇం దుకు సరైన విలువలో ఆస్తులను తాకట్టు పెట్టా ల్సి ఉంటుందని చెప్పడంతో.. పారిశ్రామికవేత్త తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని అంగీకరించాడు.. త్వరగా రుణం వస్తుందని ఆశపడ్డాడు.

కొల్‌కతాలో పటాటోపం..

రుణం తీసుకోవడానికి, రుణదాతతో మాట్లాడటానికి సదరు పారిశ్రామికవేత్త కొల్‌కతాకు వెళ్ళాడు. అక్కడ ఒక విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటల్‌లో రుణదాతతో సమావేశం అయ్యాడు. నిబంధనలు అన్నీ పారిశ్రామికవేత్తకు అనుకూలంగానే మాట్లాడారు. చెక్కులు, ఒప్పందం (అగ్రీమెంట్) లాంటివి ఏమీ లేకుండానే ముందుగా రుణం మంజూరు చేస్తామని, ఆ తరువాత ఒక నెల రోజుల్లో రుణానికి సంబంధించి ప్రాపర్టీని తాకట్టు పెట్టవచ్చని, అందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో పారిశ్రామికవేత్త సంతోసంతో గంతులు వేశాడు.

నిబంధనలకు ఇరు పార్టీలు అంగీకరించాయి. పదిహేను రోజుల్లో రుణం రూ. 50 కోట్లు ఇస్తానంటూ నమ్మబలికాడు. రుణదాత పటాటోపం, హంగు ఆర్భాటం చూసిన పారిశ్రామికవేత్త ఫిదా అయ్యాడు. కొల్‌కతా నుంచి సంతోషంగా తిరిగివచ్చాడు.

హవాలా.. రంగప్రవేశం..

త్వరగానే రుణదాత నుంచి సమాచారం వచ్చింది. రుణంగా ఇచ్చేందుకు అంగీకరించిన రూ. 50 కోట్లు పారిశ్రామికవేత్తకు అందించడానికి సిద్ధం చేశామని.. అయితే ఈ మొత్తాన్ని హవాలా మార్గంలో పంపిస్తున్నామని, అందుకు సాక్ష్యంగా 500 రూపాయల నోటును, దాని నంబర్‌నుకూడా చూపించారు. 

హవాలా ఛార్జీలుగా రూ. 25 లక్షలు..

అయితే రూ. 50 కోట్లు హవాలా మార్గంలో 24 గంటల్లో అందిస్తామని.. నోట్లను లెక్కించడానికి మనుషులు, మిషన్లు, సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాలనికూడా చెప్పారు. అయితే ఈ డబ్బు పంపించడానికి రూ. 25 లక్షలు హవాలా ఛార్జీ అవుతుందని.. ఆ మొత్తాన్ని పంపించాలంటూ రుణదాత నుంచి పారిశ్రామికవేత్తకు సమాచారం అందింది. 24 గంటల్లోనే రూ. 50 కోట్ల రుణం వస్తుండటంతో.. మరో మాట ఆలోచించకుండానే సదరు పారిశ్రామికవేత్త రూ. 25 లక్షల నగదును రుణదాతకు పంపించాడు.

లబో.. దిబో..

హవాలా ఛార్జీలుగా రూ. 25 లక్షలు చెల్లించడంతో.. వస్తాయనుకున్న రూ. 50 కోట్ల రుణం 24 గంటలు గడిచినా రాకపోవడంతో పారిశ్రామికవేత్తలో కంగారు మొదలయ్యింది. వెంటనే రుణదాతకు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్చాఫ్ అని వస్తోంది. మనిషి గురించి ఆరా తీస్తే.. మాయం అయ్యాడు. అప్పుడు అర్థం అయ్యింది.. పారిశ్రామికవేత్తకు తాను మోసపోయానని. అయితే ఈ మోసం గురించి పోలీసులకు చెబుదామంటూ.. మరో ఉపద్రవం పొంచిఉంది.

మోసగాడికి పంపించిన రూ. 25 లక్షలు నగదు. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన పత్రాలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. దీనితో లబోదిబో మంటూ.. మనసులోనే మధనపడుతున్నాడు.. బయటకు చెప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇదండీ సదరు పారిశ్రామికవేత్త మోసపోయిన హవాలా విధానం..!