23-07-2025 01:32:41 AM
ముషీరాబాద్, జూలై 22(విజయక్రాంతి): తెలంగాణలో కల్తీ కల్లును నిషేధించాలని బాధితులకు న్యాయం చేయాలని అభ్యర్థిస్తూ నిషేధ, ఎక్సైజ్, పర్యాటక అండ్ సంస్కృతి, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ నేతృత్వంలో మంగళవారం ఆప్ ప్రతినిధి బృందం కలసి వినతి పత్రం అందజేశారు.
తెలంగాణలో కల్తీ కల్లు వినియోగం కారణంగా సంభవించిన విషాద సంఘటనలపై ప్రభుత్వం దృష్టిని పెట్టాలని, ప్రమాదకరమైన పానీయం ఫలితంగా పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని, అనేక మంది ఆసుపత్రి పాలయ్యారని గమనించడం హృదయ విదారకంగా ఉందని, మన రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు చాలా తరచుగా జరుగుతున్నాయని డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు.
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో, అధికారం కలిగిన కల్లు ట్యాపింగ్ ప్లాంట్లు లేదా లైసెన్స్ పొందిన కల్లు ట్యాపర్లు లేరని, అయినప్పటికీ స్థానిక దుకాణాలలో గణనీయమైన మొత్తంలో కల్తీ కల్లు అమ్ముడవుతోందని, నిజాయితీ లేని కాంట్రాక్టర్లు క్లోరల్ హైడ్రేట్, ఆల్ప్రజోలం, డయాజెపామ్, మిథనాల్, మెగ్నీషియం క్లోరైడ్, కృత్రిమ తీపి పదార్థాలు,
యూరియా వంటి ప్రమాదకరమైన రసాయనాలను కలిపి వంద లీటర్ల అసలు కల్లు తో 1000 లీటర్ల కల్తీ కల్లు తయారు చేస్తున్నారని, దీని ఫలితంగా వేలాది లీటర్ల విషపూరిత కల్తీ కల్లు మార్కెట్ను ముంచెత్తుతూ పేద ప్రజల ప్రాణాలు బలి గొంటున్నాయని, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం జంట నగరాల్లో కల్లు అమ్మకాలను నిషేధించి, ఈత, తాటి చెట్ల దగ్గర మాత్రమే అమ్మకాలను అనుమతించాలని నిర్ణయం తీసుకుందని అయన గుర్తు చేసారు.
గత కేసీఆర్ ప్రభుత్వం ఈ నిషేధాన్ని ఎత్తివేయడం వలన కల్తీ కల్లు అమ్మకాలను పెట్టుబడిగా పెట్టే మద్యం మాఫియా ఆవిర్భావానికి దారితీసిందని తెలిపారు. కల్తీ కల్లు అమ్మకాలను నిషేదించాలని, ఈ దారుణమైన సంఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని, మరణించిన వారి కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లింపు మరియు ప్రస్తుతం కల్తీ కల్లు తాగడం వల్ల కలిగే ప్రభావాలతో బాధపడుతున్న బాధితులకు 5 లక్షల సహాయం,
కనీస ఆరోగ్య సహాయం అందించాలని డాక్టర్ దిడ్డి సుధాకర్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు ఎంఏ. మజీద్, నర్సింగ్ యమునా గౌడ్, విజయ్ మల్లంగి, డా. లక్ష్య నాయుడు, దర్శనం రమేష్, అజీమ్ బేగ్, స్వర్ణ సుబ్బారావు, క్కుతాబుద్దీన్, డా. అన్సారీ, అడ్డంకి రవీందర్, డా. పరుచూరి నరసింహ రావు తదితరులు పాల్గొన్నారు.