18-06-2024 12:05:00 AM
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై(ఈవీఎం) మరోసారి రాద్ధాంతం మొదలైంది. వీటి విశ్వసనీయతపై సాంకేతిక దిగ్గజం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేయడం ఈ కొత్త వివాదానికి కారణం. పోలింగ్ సమయంలో ఈవీఎంలు హ్యాకింగ్‌కు గురవుతున్నాయంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలు తాజా రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. అమెరికాలోని ప్యూర్టారికోలో ఇటీవల జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.‘ వ్యక్తులు లేదా కృత్రిమ మేధ( ఏఐ) సాయంతో ఈవీఎంలను హ్యాక్ చేసే ప్రమాదం కొద్దిగా ఉన్నా అది తీవ్రమైనదే’ అంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. అయితే ఈవీఎంల విశ్వసనీయతపై ఆదినుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తున్న విపక్షాలకు మస్క్ వ్యాఖ్యలు ఓ ఆయుధంగా మారాయి.
రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలు ఆయనకు వంత పాడుతూ ఈవీఎంలతో కాకుండా బ్యాలట్‌ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలను బ్లాక్‌బాక్స్‌లతో పోల్చిన రాహుల్ వీటిని పరిశీలించడానికి ఎవరినీ అనుమతించరంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల పారదర్శకత గురించి తీవ్ర ఆందోళనలు తలెత్తున్నాయంటూ మస్క్ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ ‘ఎక్’్సలో ట్వీట్ చేశారు. ఇకపై అన్ని ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలనే వాడాలని సమాజ్‌వావాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు. అయితే మస్క్ వ్యాఖ్యలను కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. హ్యాకింగ్‌పై ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మస్క్ చాలా తేలిగ్గా ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కనెక్టివిటీ, బ్లూటూత్ వైఫై, ఇంటర్నెట్ లేకుండా హ్యాకింగ్ చేయడం అసంభవమని స్పష్టం చేశారు.
భారత్‌లో ఈవీఎంలకు ఇతర పరికరాలతో అనుసంధానం కానీ, విద్యుత్ సరఫరా కానీ ఉండదని, బ్యాటరీతో పని చేస్తాయని గుర్తు చేశారు. ఇంటర్నెట్‌కు అనుసంధానించే విధంగా రూపొందించిన అమెరికా ఈవీఎంల గురించి మస్క్ అలా చెప్పి ఉంటారని ఆయన అన్నారు. అంతేకాదు తాను ఎలాన్ మస్క్ అంత నిపుణుడిని కాకపోచ్చు కానీ ఏ ప్రపంచంలో ఏ ఎలక్ట్రానిక్ పరికరాన్నయినా హ్యాక్ చేయవచ్చని, అప్పుడు టెస్లా కారును కూడా హ్యాక్ చేయవచ్చేమోనంటూ ఎద్దేవా చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఐటి నిపుణుడు శామ్ పిట్రోడా సైతం స్పందించారు. తాను ఎలక్ట్రానిక్ టెలికాం, ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగాల్లో అరవై ఏళ్ల పాటు పని చేశానని, ఈవీఎంల తారుమారుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.. పోలయిన ఓట్లను లెక్కించడానికి బ్యాలెట్ పేపరే సరయినదని ఆయన స్పష్టం చేశారు.
‘రాహుల్ గాంధీ వయనాడ్, అమేథీ రెండు చోట్లనుంచి గెలిచారు.అక్కడ కూడా ఈవీఎంలనే వాడారు. ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తారా?’ అంటూ మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. నిజానికి ఈ వివాదం ఇక్కడితో ఆగకపోవచ్చు. మరి కొద్ది రోజుల్లోనే పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అక్కడ కూడా ప్రతిపక్షాలు ఈ విషయాన్ని లేవనెత్తే అవకాశం ఉంది.
దేశ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలను ప్రవేశపెట్టినప్పటినుంచి కూడా ప్రతిపక్షాలతో పాటు పలువురు మేధావులు కూడా ఈవీఎంల విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ఈసీ అనేక సార్లు సమావేశాలు నిర్వహించింది. వివాదం సుప్రీంకోర్టుకు కూడా ఎక్కింది. తాజాగా వీవీప్యాట్‌లకు సంబంధించిన కేసులో కూడా సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌కే మద్దతుగా నిలిచింది. అయినప్పటికీ ఈ వ్యవహారంపై వివాదాలు సద్దుమణగలేదు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఏవో ఒకటి రెండు ఘటనల్లో ఈవీఎంలపై ఫిర్యాదులు వచ్చినా, దాదాపుగా అన్ని పక్షాలు ఫలితాలపై సంతృప్తిగానే ఉన్నాయి. అలాంటి తరుణంలో మస్క్ రాజేసిన ఈ దుమారం ఎంతదాకా పోతుందో చూడాలి. బీజేపీ ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాలకు మరోఆయుధం దొరికినట్లయింది.