calender_icon.png 21 August, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల భవిష్యత్తుకు భరోసా

18-06-2024 12:05:00 AM

నేటి సమాజంలో బాలికలు దేనిలోనూ తక్కువ కాదు. అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు బాలికలు మారాలి. మహిళలు ఏ రంగంలో ఎదగాలన్నా, అన్ని విషయాల్లో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ‘మేము అమ్మాయిలం’ అనే భయా న్ని విడిచి పెట్టినట్లయితే భవిష్యత్తులో ఉన్నత స్త్రీలుగా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. విద్యార్థి దశనుండే ఈ అలవాటు బాలికలకు కలిగేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని మానసికంగా బలవంతులను చేయాలి. సమాజంలో బాలికల సంరక్షణపట్ల స్పృహను పెంపొందించడానికి, వారి హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై అవగాహన కల్పించ డానికి ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఎన్నో సదస్సులు నిర్వహిస్తున్నది. ఇవి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంటాయి.

వారి ఎదుగుదలతోనే దేశాభివృద్ధి

ప్రపంచవ్యాప్తంగా 12.9 కోట్లమంది బాలికలు పాఠశాలలకు దూరంగా ఉంటున్నారు. వీరిలో 3.2 కోట్లమంది ప్రాథమిక పాఠశాల వయస్సు, 3 కోట్లమంది దిగువ- మాధ్యమిక పాఠశాల వయస్సు, 6.7 కోట్లమంది ఉన్నత -సెకండరీ పాఠశాల వయస్సు కలిగిన వారు. ప్రాథమిక విద్యలో 49 శాతం దేశాలు మాత్రమే లింగ సమానత్వాన్ని సా ధించాయి. మాధ్యమిక స్థాయిలో, అంతరం పెరుగుతూనే ఉంది. 42 శాతం దేశాలు దిగువ మాధ్యమిక విద్యలో లింగ సమానత్వాన్ని సాధించాయి. ఉన్నత మాధ్యమిక విద్యలో 24 శాతం దేశాలు వున్నాయి.

బాలికల విద్య ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తూ అసమానతలను తగ్గిస్తుంది. ఇది మ రింత బలపడితే సమాజానికి మంచితోపాటు సామర్థ్యాన్ని పెంచేలా చేస్తుంది. స మాజం వేగంగా పురోగమించడానికి, భారతదేశం ప్రపంచంలో అగ్రదేశాల జాబితాలో ఉండడానికి, మానవ వనరుల అభివృద్ధికి విద్యా రంగంలో వస్తున్న మార్పులు ముఖ్యమైనవి. భావి భారత పౌరులను తీర్చి దిద్దడంలో విద్యావ్యవస్థ కీలకమైంది. బాలలందరికీ విద్యను అందించడానికి విద్యా హక్కు చట్టం అమలవుతున్నది. దీనిద్వారా బాలికలు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొనే అవకాశం ఉంది. 

దేశాభివృద్ధి జరగాలంటే పురుషులతోపాటు మహిళలూ ముందుండాలి. అందు కోసమే ప్రభుత్వం బాలికలకు విద్యలో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పిస్తున్నది. బాలికలు, యువతులు, మహిళల కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నది. ఆడపిల్ల పుడితే ‘మహాలక్ష్మి’ పుట్టిందని ఆనందించే వారు ఉంటారు. కానీ, మరి కొందరిలో ‘అయ్యో ఆడపిల్ల పుట్టిందా’ అనే నిట్టూర్పు కూడా కనిపిస్తున్నది. గతంలో భారత ప్రభుత్వం ‘నేషనల్ గరల్స్ డెవలప్‌మెంట్ మిషన్’ పేరుతో ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై పూర్తి బాధ్యత తీసుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.

చైతన్యవంతమైన కార్యక్రమాలు

ఈ విషయంపై సామాజిక అవగాహనను పెంచి బాలికలకు విముక్తి కలిగిం చేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ సందర్భంగా మహిళా సాధికారతను బాలికల విద్య, పోషకాహారం, న్యాయం, విద్య, సహాయం, సంరక్షణ వంటి అంశాలకు సంబంధించిన కనీస హక్కులపై దేశంలో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేలా చైతన్యం కలిగించ డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బాలికల విద్యపై పెట్టుబడి పెట్టడం వల్ల సమాజాలు, దేశాలు, ప్రపంచం మొత్తం అద్భుత రీతిలో రూపాంతరం చెందుతుంది. విద్యను పొంది న బాలికలు ఆరోగ్యకరమైన, ఆదర్శప్రాయమైన జీవితాన్ని, కుటుంబస్థితిని గడపడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇలాంటి వారు కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ కుటుంబానికి ఆధారంగానూ నిలుస్తున్నారు. 

బాలికల విద్య అడ్డంకులకు కారణాలు అనేకం. అందులో ముఖ్యంగా పేదరికం, బాల్య వివాహాలు, లింగ ఆధారిత భేదాలు, అవగాహన లోపం వంటివి వున్నాయి. చిన్నారులను పాఠశాలలో చేర్చేటప్పుడు పేద కుటుంబాలు తరచుగా అబ్బాయిలకు అనుకూలంగా ఉంటూ ఇంగ్లీష్ కాన్వెంట్ స్కూళ్లలో చేరుస్తూ, బాలికలను మాత్రం స్థానిక పాఠశాలల్లో చేర్చడం ఇప్పుడు కూడా గ్రామాల్లో నిత్యం కనబడుతున్నది. బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అవగాహన ఉంటే ఆడపిల్లలపట్ల వివక్ష ఉండదు. కాబట్టి, ప్రతి ఒక్కరికి అవగాహన కోసం ఈ సందర్భాన్ని ఉపయోగించుకోవాలి.

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాక, కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలకు పాల్పడేవారూ ఉన్నారు. పుట్టిన తరువాత కూడా అమ్మాయిలకు సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి నిర్మూలనకే ‘నేషనల్ గరల్స్ డెవలప్‌మెంట్ మిషన్’ రూపొందింది. ఇందులో భాగంగానే ప్రజలందరికీ ఆడపిల్లల విలువ, గొప్పతనం, వారి ఆవశ్యకతలను తెలియచేసి వారిపట్ల ఉన్న తక్కువ భావనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 

40% బాల్యవివాహాలు భారత్‌లోనే!

బాలల విద్యాహక్కు చట్టం అమలు మన కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ముఖ్యమై న అంశం బాలికా విద్య. రాష్ట్రంలోని బాలికలందరికీ సమానత్వం, సమన్యాయం, విద్యా రంగంలోనే కాక సామాజికంగా సాధికారత సాధించాల్సిన అవసరం ఉంది. పాఠశాలల్లో బాలికల నమోదు, వారికి నేర్పే పాఠాలు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను తెలివిగా పరిష్కరించుకునే విధం గా ఉండాలి. వివక్షకు, హింసకు, అసమానతలకు గురవుతున్న బాలికలను చైతన్యప రుస్తూ, ధైర్యాన్ని కలిగించాల్సిన భాద్యత మన అందరిమీద ఉంది.

దేశంలో రోజురోజుకూ అడపిల్లల సంఖ్య తగ్గిపోతోందని, ఇది ఇలాగే కొనసాగితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎన్నో సర్వేలు చెపుతున్నాయి.  ‘ప్రపంచంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 40% పైగా భారతదేశంలోనే’ అని ఈమధ్య ‘యూనిసెఫ్’ వారు ప్రకటించారు. ఇప్పటి చాలా రాష్ట్రాల్లో 40 శాతానికి పైగా చిన్నారులు పదో తరగతికంటే ముందే బడి మానేస్తున్నారు. అమ్మా యిల పెళ్లికోసం ఆర్థిక సహాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. మరెన్నో పథకాలు ప్రవేశపెట్టి బాలికలకు ప్రోత్సాహాన్నిస్తు న్నారు. బాలికల రక్షణకు, వారి భ్రూణహత్యల నివారణకు కేంద్రం ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం చేపట్టింది. 

దృక్పథంలో మార్పు రావాలి

బాల బాలికల లింగ నిష్పత్తిలో వ్యత్యాసం బాగా పెరిగింది. మొత్తం జనాభాలో బాలికల సంఖ్య తగ్గిందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన ‘చిల్డ్రన్ ఇన్ ఇండియా, -ఏ స్టాటిస్టికల్ అప్రైజల్’ నివేదిక ద్వారా తెలియపరిచారు. సమాజంలో మంచి మార్పు రావాలంటే తల్లిదండ్రుల దృక్పథం మారాలి. అనాదిగా ఆడపిల్లలపై వివక్ష ఉన్నదని అనుకుంటే వీరనారీమణులు, రాజనీతిజ్ఞులు, మహిళా శిరోమణులు మనకు ఎలా తయారయ్యారు? డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, శాస్త్రవేత్త లుగా, సివిల్ సర్వీస్ అధికారులుగా, పారిశ్రామిక వేత్తలుగా,  విద్యావేత్తలుగా, పోలీసు ఆఫీసర్లుగా, సైన్యంలో కెప్టెన్లుగా, విమానాలు నడిపే పైలెట్లుగా, సరిహద్దుల్లో పోరాడే వీరజవాన్లుగా మహిళలు పెద్ద ఎత్తున రాణిస్తున్నారు. పురుషులు పని చేసే అన్ని రంగాల్లో మహిళలు కూడా ఎంతో గొప్పగా, విజయవంతంగా తమ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎప్పటికైనా ఆడపిల్లలు జాతికి వెలుగునిచ్చే మహిళామణులుగా మరింతగా ఎదగాలంటే వారిని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం.

వ్యాసకర్త సెల్: 9963499282