calender_icon.png 4 May, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలి

03-05-2025 07:21:36 PM

జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆస్పిరేషన్ బ్లాక్ లో మౌలిక వసతుల కల్పనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి(District Additional Collector Deepak Tiwari) అన్నారు. శనివారం కలెక్టరేట్ లో తిర్యాణి మండల ఆస్పిరేషన్ బ్లాక్ లోనీ 38 అంశాలపై జిల్లా శిశు సంక్షేమ, వైద్య, విద్య, పశుసంవర్ధక, వ్యవసాయ, టి ఫైబర్, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... గత 2 సంవత్సరాల నుండి తిర్యాణి ఆస్పిరేషన్ బ్లాక్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మౌలిక వసతులు కల్పించడంలో భాగంగా 38 అంశాలపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.

వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గర్భం దాల్చిన వారి వివరాలను తప్పనిసరిగా పోర్టల్ లో నమోదు చేయాలని, ప్రసవం తర్వాత వివరాలు కూడా నమోదు చేయాలని, క్షయ, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలు అందించాలని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, పిల్లలకు సకాలంలో పోషకారాన్ని అందించాలని, సామ్ మామ్ లో 6 నెలల నుండి 6 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల ఎత్తు, బరువు పరిశీలించి మానసిక, శారీరక ఎదుగుదలను పర్యవేక్షించాలని, వివరాలు పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. తిర్యాణి బ్లాక్ లోని అంగన్వాడీ కేంద్రాలలో మూత్రశాలలు, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

తిర్యాణి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో టి ఫైబర్ సౌకర్యం కల్పించాలని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గృహాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని, మహిళ స్వయం సహాయక సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ బ్యాంకు రుణాలు అందించి సంఘాలను బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యాశాఖ అధికారులు బడి వయసు గల బడి బయట పిల్లలను గుర్తించి తిరిగి బడిలో చేర్పించాలని, బడి వయసు గల ఒక్కరు కూడా బయట ఉండకూడదని తెలిపారు. 10వ తరగతిలో 60 శాతం పైన మార్కులు సాధించిన వారి వివరాలను పోర్టల్ లో నమోదు చేయాలని, ప్రతి పాఠశాలలో బాలికల కొరకు ప్రత్యేక బూత్ర శాలల నిర్మాణాలు చేపట్టాలని, పాఠశాలలకు అవసరమున్న కంప్యూటర్, ప్రింటర్లు అందజేసేందుకు వివరాలు సమర్పించాలని తెలిపారు.

ధికారులు సమన్వయంతో పనిచేసి ఆస్పిరేషనల్ బ్లాక్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సురేష్, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, తిర్యాణి మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేష్, విద్య, వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.