24 August, 2026 | 1:41 AM

రిజర్వేషన్ల రద్దుకు ఆందోళన సిగ్గుచేటు

24-08-2026 12:00 AM
  1. బీసీ కులగణను తప్పుదోవ పట్టించేందుకే ఉద్యమాలు
  2. రద్దు కోరే వారు ఈడబ్ల్యూ ఎస్‌పై వైఖరిని స్పష్టం చేయాలి
  3. వ్యతిరేక ఉద్యమాలు కొనసాగిస్తే ఐక్యంగా స్పందిస్తాం
  4. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక

ముషీరాబాద్,ఆగస్టు 23(విజయక్రాంతి): బీసీ కులగణనను తప్పుదారి పట్టించేందుకే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల రి జర్వేషన్లను రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఆం దోళన చేపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆదివారం బీసీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో జాజుల మాట్లాడుతూ కులగణన ద్వారా బీసీల జనాభా దామాషా ప్రకా రం రాజ్యాంగబద్ధ హక్కులు కల్పించాలని బీ సీలు పోరాడుతున్న సమయంలో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

రిజర్వేషన్ల రద్దు కోరేవారు ముందుగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై తమ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశ సంపద, సహజ వనరులు జనాభా దామాషా ప్రకారం సమానం గా పంపిణీ చేసి, సామాజిక ఆర్థిక అసమానతలు తొలగించిన తర్వాతే రిజర్వేషన్ల రద్దుపై చర్చ జరగాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొనసాగి స్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఐక్యంగా స్పందిస్తాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కుందారం గణేష్ చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, పిట్ల శ్రీధర్, బీ మణిమంజరి సాగర్, జాజుల లింగం గౌడ్, తాటిపల్లి పాం డు, మడత వెంకట్ గౌడ్, మల్లన్న తదితరు లు పాల్గొన్నారు.