27 August, 2026 | 4:22 AM

సిడ్బీ-ఎయిర్‌బస్ మధ్య ఒప్పందం

21-05-2024 02:27 AM

హెలికాప్టర్ల కొనుగోళ్లకు ఆర్థిక సహకారం 

ఎంఓయూపై ఇరు వర్గాల సంతకం

రోటరీ వింగ్ సెక్టార్‌లో వచ్చే ఎంఎస్‌ఎంఈలకు మేలు 

హైదరాబాద్, మే 20 ( విజయక్రాంతి): దేశంలో హెలికాప్టర్ల కొనుగోలు అంశంపై స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (సిడ్బీ) ఎయిర్‌బస్ మధ్య సోమవారం కీలక ఒప్పందం కుదిరింది. దేశంలో హెలికాప్టర్ల కొనుగోలుకు ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించాయి. ఈ ఎంఓయూపై సిడ్బి చీఫ్ రాహుల్ ప్రియదర్శి, ఎయిర్‌బస్ హెలికాప్టర్ ఇండియా, దక్షిణాసియా చీఫ్ జనరల్ మేనేజర్ సన్నీ గుగ్లానీ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రోటరీ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనాన్సింగ్‌లోకి ఎయిర్‌బస్ ప్రవేశించినట్లయ్యింది. ఎంఓయూ ప్రకారం.. ఎయిర్‌బస్ హెలికాప్టర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సిడ్బికి బదిలీ చేయాల్సి ఉంటుంది. 

ఇందుకుగాను ఎయిర్‌బస్‌కు సిడ్బికి నగదును అందజేస్తుంది. అలాగే హెలికాప్టర్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఎయిర్‌బస్ సిడ్బీ ఫైనాన్సింగ్ విషయంలో దోహదపడుతాయి. రోటరీ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫైనాన్సింగ్‌లో తాము కొత్త వెంచర్‌ను తీసుకొచ్చామని, ఈ రంగంలో వచ్చే ఎంఎస్‌ఎంఈలకు కొత్త మార్గాలను సూచిస్తుందని రాహుల్ ప్రియదర్శి పేర్కొన్నారు. అలాగే రోటరీ వింగ్ సెక్టార్‌లో ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది వివరించారు. తమ రెండు సంస్థలు కలవడం అనేది పౌర హెలికాప్టర్ మార్కెట్ విస్తరణకు దోహదపడుతుందని ఎయిర్‌బస్ ఇండియా చీఫ్ గుగ్లానీ చెప్పారు. 

భారత్‌లో వినియోగించే హెలికాప్టర్లలో ఎక్కువ భాగం విదేశాల్లో తయారైనవే కావడం గమనార్హం. అలాగే 2019 నాటికి ప్రపంచంలోని హెలికాప్టర్లలో అధ్యధికంగా తయారు చేసింది ఎయిర్‌బస్‌కు చెందినవే ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం దేశంలో పౌర హెలికాప్టర్ల విస్తరణకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.