26 June, 2026 | 6:12 PM

Breaking News

నేల స్వభావం, నీటి వసతులను బట్టి సరైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవాలి..

10-06-2025 08:28 PM

కాంప్లెక్స్ ఎరువులను ఎట్టి పరిస్థితుల్లో పైపాటుగా వేయకూడదు..

పురుగు మందులను విచక్షణా రహితంగా వాడకూడదు..

మండల వ్యవసాయ అధికారిని సరస్వతి పద్మజ..

మునుగోడు (విజయక్రాంతి): నేల స్వభావాన్ని నీటి వసతులను బట్టి సరైన కొత్త విత్తనాలను ఎంచుకొని అధిక దిగుబడులను సాధించాలని మునుగోడు మండల వ్యవసాయ అధికారిని సరస్వతి పద్మజ(Agriculture Officer Saraswati Padmaja) అన్నారు. మంగళవారం కొరటికల్ గ్రామం రైతువేదికలో ఫార్మర్ రిజిస్టర్ ను తనిఖీ చేసి మాట్లాడారు. పత్తి పంట యాజమాన్యం పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. తొలకరిలో కనీసం 60 మి.మీ. వర్షం కురిసిన తర్వాత విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి మొలక శాతం బాగుంటుందని అన్నారు. పత్తిలో తప్పనిసరిగా అంతర పంటలు వేసి ఆదాయ ఓనర్లను సమకూర్చుకోవాలని తెలిపారు. ఎరువులను భూమి లోపల మొక్కకు దగ్గరగా పడేటట్లు వేసుకొని, నత్రజని, పొటాష్ ఎరువులను మాత్రమే పైపాటుగా వేసుకోవాలి.

పురుగులు, తెగుళ్ళ నష్ట పరిమితి స్థాయి దృష్టిలో ఉంచుకొని మందులు పిచికారీ చేసి, గులాబి రంగు పురుగు ఉధృతి గమనించడానికి, రెక్కల పురుగు నియంత్రణకు లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలని అన్నారు.పత్తి తర్వాత జనవరిలో పప్పుధాన్యపు పంటలైన పెసర, మినుము పంటలు వేసుకుని మంచి దిగుబడిని పొంది, భూసారాన్ని పెంచుకోవచ్చు అని రైతులకు సూచించారు. రసాయనిక కలయిక లేని రెండు లేదా మూడు పురుగు, తెగుళ్ళ మందులను కలిపి పిచికారీ చేయకూడదని,గులాబి రంగు పురుగు ఆశించిన పత్తిని ఇళ్ళలో గానీ, జిన్నింగ్ ఫ్యాక్టరీ వద్దగాని నిల్వ ఉంచకూడదు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి వెంకటేశ్, రైతులు ఉన్నారు