అంబ’s రివెంజ్.. ఏఐ సినిమా
తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ ‘అంబ’s రివెంజ్’ చిత్రం ముస్తాబవుతోంది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఏఐ విజువల్ డిజైన్, డెవలప్‌మెంట్‌ను ‘కాలై విజువల్ స్టూడియోస్’ అందిస్తోంది. పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర అంబ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పురాణ గాథను ఆధునిక దృక్పథంతో, అత్యాధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా నిర్మాత యోగేంద్ర పొట్లూరి, దర్శకుడు జయవర్ధన్ మడి మాట్లాడుతూ, తెలుగు సినిమా నిర్మాణంలో ముఖ్యంగా విజువల్ డిజైన్, పాత్రల రూపకల్పన, కథా రూపాంతరం వంటి అంశాల్లో ఆధునిక ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నామని తెలిపారు. టైటిల్ పోస్టర్ విడుదలతో చిత్రాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసే తొలి అడుగు పడిందని, సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.






