calender_icon.png 18 November, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐలేని కథ

24-07-2024 12:00:00 AM

శ్రీరామోజు హరగోపాల్ :

వరంగల్‌కు సమీపంలోని మరొక చారిత్రక పట్టణం ఐనవోలు. క్రీ.శ. 5,6 శతాబ్దాలలో పాలకులైన బాదామీ చాళుక్యులకాలంలోనే ప్రసిద్ధులైన అయ్యలోలు  అయినూరవ రు) అనే వ్యాపార శ్రేణి లేదా వర్తకుల సంఘం దేశ, విదేశాలలో వ్యాపారం చేస్తుండేది. బాదామీ, పట్టడకల్ నగరాల పక్కన వారి పేరుమీదనే ఉన్న ఐహోలు నగరం నిర్మించబడ్డది. అద్భుతశిల్ప సంపదతో దేవాలయాలకు ప్రసిద్ధం. ఆ అయ్యవోలుే 500 వ్యాపార శ్రేణి నిర్మించిన నగరమే హనుమకొండ జిల్లాలోని మన అయ్యనవోలు, ఐనవోలు, ఐలేని.

ఇక్కడ లభించిన రెండు శాసనాలలో కళ్యాణీ చాళుక్యరాజు త్రిభూవనమల్ల 6వ విక్రమాదిత్యుని కాలం క్రీ.శ. 1118 ఏప్రిల్ 22నాటి దొకటి, ఈ శాసనంలో పేరు తెలియని ప్రధాన కరితుర(గ)(సా)హణి దండనా(యకు)డు లకు లేశ్వరపండితునికి ధారాపూర్వకంగా చేసిన దానప్రస్తావన ఉంది. ఈ పండితుడు కాలాముఖ గురువై ఉంటాడు. శ్రీశైలం శిలామఠంలోని కాలాముఖ గురువు రామేశ్వరపండితుడే కాకతీయులకు శివదీక్ష లిచ్చారని క్రీ.శ.1090 నాటి హన్మకొండ దుర్గరాజు శాసనం వల్ల (వరంగల్ శాసన సంపుటి, శా.సం.15) తెలుస్తున్నది. ఈ శాసనం ఐలేనిని ‘అయనబోలి’ అని పేర్కొంటున్నది. 

రెండవది పశుపతిపండితుని కొడుకు నాగనాథ రచించిన సంస్కృత నక్షత్రమాల శాసనం రాచకొండ వెలమ రాజు అనవోతానాయకుని కాలం సమరవిజేతగా ఓరుగ ల్లు, త్రిభువనగిరి, రాజుకొండ, సింగవరం, ఇతర తెలుగుదేశాలను పాలించే అనవోతానాయకుడు ఐలేని మల్లారి (మైలారదేవ), మాడచీ(శైలసుత) దర్శించి మల్లన్నకు అంగ, రంగభోగనిమిత్తం భూదానాలు చేశాడు. ఈ శాసనంలో ఐలేని అయ్యనవోలుగానే పేర్కొనబడ్డది. 

ఐలేని మల్లన్న లేదా మల్లారి కళ్యాణీచాళుక్యుల కాలం నుంచి ఆరాధింపబడుతున్న దేవుడు, శివస్వరూపుడు. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని వెల్పుగొండలో నిర్మించిన దేవాలయం మల్లన్నదే. శాసనాధారం ఉన్నది. కాకతీ యుల కాలంలో ప్రస్తుత సూర్యాపేట జిల్లా నడిగూడెంలో లభించిన శాసనం మైలారదేవుని ప్రతిమాల క్షణాన్ని వివరిస్తున్నది. కాకతీయుల కాలం కంటే ముందు నుంచే వీరభద్రునికి ప్రతిరూపం వంటి మైలారుదేవుడు, మల్లన్న దేవుని విగ్రహాలు ప్రతిష్టించడం మొదలైంది.

హన్మకొండ జిల్లా ఐనవోలులోని మల్లన్న గుడిలో మల్లన్న ముందర ఉన్న శివలింగం అర్థపానవట్టం మీద ఉన్నదనే ప్రచారముంది. కాని, నిజానికి అది అర్థపానవట్టం కాదు. ఏక దేవతాశిల్పం యొక్క అధిష్టానపీఠం. దాని మీదున్న రాతితొలిలో బాణలింగాన్ని ప్రతిష్టించారు. ఏ పానవట్టం కూడా సగముండదు. అది శిల్పశాస్త్రం ప్రకా రం కాని, శైవాగమాల ప్రకారం కాని అంగీకారయోగ్యం కాదు. ఐలోని మల్లన్న గుడి కన్నా ముందు ఇక్కడ ఇతర మతదేవాలయముండేదని, దానిని తొలగించి మల్లన్న గుడిగా చేయడం, శివలింగ ప్రతిష్ట చేయడం జరిగిందనడానికి ఈ అర్థపానవట్టమే సాక్షి.

ఐనవోలు ఊరగుట్టమీద పాత దేవాలయాల ప్రాంగ ణం ఉంది. ఆ రాష్ట్రకూటుల నాటి నిర్మాణాలు జైన బసదులనిపిస్తాయి. ఆ గుట్ట మీద నుంచే దేవుడు దిగివ చ్చాడ ని జనం నానుడి. అందువల్ల ఆ అధిష్టానపీఠం మీది దేవుడెవరో తెలిసిపోతుంది. 

ఐలేని (అయ్యనవోలు), పున్నేలు (పున్నవోలు) జంట నగరాలు. పున్నేలులో రాష్ట్రకూటుల పిదప 30 యేండ్లకు రాజ్యానికొచ్చిన చాళుక్యఇరివెబెడంగ శాసనం ఉన్నది. అంటే ఆ శాసనం వేసేనాటికే ఈ నగరం ఉన్నదన్నమాట. ఐనవోలు మల్లన్న గుడి పక్కన ఉన్న హనుమాండ్ల గుడి స్తంభాలు రాష్ట్రకూటులశైలివే. అయ్యనవోలు కూడా రాష్ట్రకూటులకాలం నుంచి ఉన్నదే. రాష్ట్రకూట చక్రవర్తి అమో ఘవర్షునికాలంలో అర్మకుండె (హన్మకొండ) భీమచాళుక్యుని పేరన శాసనముంది. కొండపర్తి, జాఫర్ఘడ్‌లో రాష్ట్రకూట శాసనాలలో అర్మకుండ (హన్మకొండ) ప్రస్తావనలున్నాయి. 

ఐలేని మల్లన్న గుడికి బయటప్రాకారం కోటగోడలెక్క నిర్మాణమైంది. గోడకు పక్కన ప్రదక్షిణాపథం సొరంగంవలె ఉంది. అష్టభుజాకృతిలో 108 స్తంభాలతో నిర్మింప బడ్డ ఈ ఆలయం చాళుక్య నిర్మాణ శైలిలో ఉంది. గర్భగుడిలో మల్లన్న, మల్లారి, ఖండేలారాయుడు అని పిలువబడే మైలారుదేవుడు గొల్ల కేతమ్మ, బలిజమేడలమ్మలతో కొలు వై కనిపిస్తాడు. మల్లన్న ముందర ఒక పక్కకు ఏకదేవత అధిష్టానపీఠం మీద అమర్చిన బాణలింగం ఉన్నది. ఆ పీఠాన్నే అర్థపానవట్టమని, దేశంలో మరెక్కడా లేదని ప్రచారమున్నది. అది నిజం కాదు. అంతకుముందు ఆ పీఠం మీద మరొక శిల్పం నిలిపి ఉండేది. 

దేవాలయ ప్రాంగణంలో విరిగిపడిన కళ్యాణీచాళుక్య శాసనం, గద్దెమీద నిలిపిన రాచకొండవారి శాసనం ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో కనిపించే శిల్పాలలో మూడు జతలపాదాలు, కొత్త నంది, నాలుగు నాగశిలలు, హారాలు, జూకాలు, వీరకాసె, బొడ్లో కైజారులతో, విరబోసుకున్న జటలతో ఒక వీరుడు, కత్తి, డాలు పట్టుకుని డాకాలుమోపి, యుద్ధానికి సాగుతున్నట్టున్న చాళుక్య శైలి వీరగల్లు, భైరవుని శిల్పం, ఒకచోట అర్ధపర్యంకాసనంలో కూర్చుని ఉన్న వీరభద్రుని శిల్పం.

నంది మండపంలో కాకతీయశైలి నంది ఉన్నాయి. ప్రత్యేకంగా కనిపించే ఇంకొక వీరగల్లును రుద్రమదేవి శిల్పమంటున్నారు. ఈ శిల్పంలో అశ్వారోహకుడైన వీరునికి ముందు, వెనుక ఇద్దరు ఛత్రధారులున్నారు. గుర్రం వెనుక, ముందు ఒక్కొక్క వ్యక్తి నిలబడి ఉన్నారు. గుర్రం కాళ్లనడుమ హతుడైన మనిషి పడివున్నాడు. గుర్రం ముంగాళ్ళెత్తి శత్రువును దునుమాడు తున్నది. వీరుని తలవెనుక జారుముడిని చూసి స్త్రీ అనుకున్నారేమో. కాకతీయశైలి శిల్పాలలో ఈ జారుముడి ప్రత్యేకంగా ఉంటుంది. 

మల్లన్నగుడి దక్షణి ద్వారం వైపున ఉన్న వీరగల్లు ఆత్మాహుతి శిల. సిద్ధాసనంలో కూర్చుని తన కంఠాన్ని తానే ఉత్తరించుకుని శివునికి సమర్పించుకున్న వీరభక్తుని స్మారకశిల ఇది. 

దేవాలయానికి ముందు తూర్పు దిక్కున కాకతీయులు కట్టించిన అందమైన రంగమంటపం ఉన్నది. తొలుత రాష్ట్రకూటులు, తర్వాత గుడిని చాళుక్యులు నిర్మిస్తే, కాకతీ యులు పునరుద్దరించారు. మల్లన్న గుడిని. కాకతీయుల కాలంలోనే గుడికి నలువైపుల తోరణ ద్వారాలను నిలిపి ఉంటారు. వరంగల్ కోట తోరణ ద్వారాలకన్నా ముందటివి. గుడికి రెండువైపులనే ద్వారాలుండేవి. మూడో ద్వారాన్ని పురావస్తు శాఖవారు పునరుద్ధరించారు. నాలుగోవైపు ద్వారం జాడలు లేవు. ఉండి ఉండాలె.