calender_icon.png 18 November, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేయిగొంతుల వేణుమాధవుడు!

24-07-2024 12:00:00 AM

చతుషష్టి కళల్లో ఒకటి ‘స్వర వంచన’. స్వర వంచన అంటే మోసం అని కాదు గానీ గొంతుమార్చి మాట్లాడటం. అందుకే దీన్ని స్వరానుకరణ లేక ధ్వన్యనుకరణ అంటారు. ఒక వ్యక్తి తన సహజమైన స్వరంతో కాకుండా వేరేవాళ్ల గొంతుని ఇమిటేట్ చేస్తూ మాట్లాడటం. దీన్ని ఆధునిక పరిభాషలో మిమిక్రీ అంటారు. ఈ మిమిక్రీ కళలో ప్రపంచంలోనే అగ్రగణ్యులు నేరెళ్ల వేణుమాధవ్. ధ్వన్యనుకరణ అనే ఒక కళ ఉందని, దానికి గుర్తింపు కూడా లేని రోజుల్లో ఆ కళను అవపోసన పట్టి, ఒక హుందాతనాన్ని, హోదాను, గౌరవాన్నీ కల్పించిన ప్రముఖుడు మిమిక్రీ పితామహుడు నేరెళ్ల వేణుమాధవ్. 

వరంగల్‌లోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మి దంపతులకు నేరెళ్ల మాధవ్ 1932 డిసెంబరు 28న జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త. ఆరు భాషల్లో పండితుడు. తండ్రికి సాహిత్యంలో మంచి అభిరుచి ఉండటం వల్ల ఆ కాలంలో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అట్లా వీరింట్లో బస చేసిన వారిలో చెళ్లపిళ్ల వేంక టశాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రీ, కాశీ కృష్ణాచార్యులు, యర్రమిల్లి జగ్గన్న శాస్త్రీ వంటి ఉద్ధండులున్నారు. అలా సాహితీ చర్చల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. 

తమ ఇంటికి వచ్చే స్నేహితులు, ఇరుగుపొరుగువారి గొంతులను నిశితంగా గమనించే నేరెళ్ల మాధవ్.. వాళ్లు వెళ్లిపోయాక వారి గొంతులను అనుకరించి మాట్లాడుతూ సరదాగా గడిపిన బాల్యం ఊహించని రీతిగా దాన్నే తన వృత్తి, -ప్రవృత్తిగా మార్చుకోవాల్సి వస్తుందని బహుశా ఆయన కూడ ఊహించి ఉండకపోవచ్చు. అదే ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది. 

చిన్నప్పటి నుంచి సీనిమాలంటే ఇష్టంగా చూసే  నేరెళ్ల వేణుమాధవ్  ఆ కాలంలో నటుడుగా ప్రఖ్యాతిగాంచిన చిత్తూరు నాగయ్య అంటే వీరాభిమానాన్ని పెంచుకున్నాడు. చిత్తూరు నాగయ్య కూడా ధ్వన్యనుకరణ చేయగలవారు కావడంతో ఆయన పట్ల వున్న అభిమానం కేవలం అభామానంగానే ఉండకుండా ఆ రంగంలో ప్రవేశించేలా చేశాయి. నాగయ్య,  వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య వంటి నటులు నటించిన సినిమాలు చూసి, ఇంటికి రాగానే ఆ సినిమాల్లోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలైంది వారి మిమిక్రీ ప్రస్థానం.

కాలేజీలో మొదలైన ప్రస్థానం..

1952లో వరంగల్ ఆరట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చేరిన రోజుల్లో  ప్రిన్సిపాల్ బారు వెంకట రామనర్సు  గుడ్ కాండక్టు కింద వేణుమాధవ్ గారికి ఆ రోజుల్లో అరవై రూపాయల స్కాలర్ షిప్  మంజూరు చేశారు. ఆ డబ్బుతో ముప్పయి ఇంగ్లీషు సినిమాల్ని తనివితీరా చూసి కాలేజీలో జరిగిన ఒక వేడుక సందర్భంగా తాను చూసిన సినిమాల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేషాలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్‌తో సహా సభా వేదికగా వినిపిస్తే, ప్రిన్సిపాల్  రామనర్సు పరమానందభరితులై “యూ విల్ బికం ఎ గ్రేట్ ఆర్టిస్టు ఇన్ ద వరల్డ్‌” అని అన్నారు.  ఇక నుంచి నీకే అవసరం వచ్చినా నువ్వెవరినీ అడగకు. నా పెద్ద కుమారుడు విఠల్ (బీపీఆర్ విఠల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు) అయితే నీవు నా రెండవ కుమారుడవు అని మనసారా ఆశీర్వదించారు. బహుశా ఆ దీవెనలే వేణుమాధవ్ ని ‘విశ్వ విఖ్యాత ధ్వన్యనుకరణ సామ్రాట్’ గా ఎదిగేలా చేశాయి.

తొలి ప్రదర్శన..

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947వ సంవత్సరంలో (15 ఏళ్ల ప్రాయంలో) తొలితరం నటుడైన చిత్తూరు నాగయ్య స్వరాన్ని అనుకరించడం ద్వారా తన కళా ప్రస్థానానికి బాటలు వేసుకున్నారు. అప్పటికే ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నా.. తనకు గుర్తింపు తెచ్చిన మిమిక్రీని మాత్రం వదల్లేదు. అలా మొదలైన ప్రస్థానం పది వేల ప్రదర్శనల వరకు కొనసాగింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని చారిత్రక కళా వేదికలైన రవీంద్ర భారతి, ఆంధ్ర సారస్వత పరిషత్తు, త్యాగరాయగాన సభ ఇలా అన్నింటిపై ప్రదర్శనలిచ్చి మెప్పించారు.  

ఓరుగల్లు నుంచి ఐరాస వరకు..

వరంగల్ నుంచి ప్రారంభమైన ఆయన కళా ప్రస్థా నం ఐరాస వరకు వెళ్లింది. ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కాలంలో అమెరికాలో ప్రదర్శనకు అవకాశం రావడంతో ఆయన పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. 1971లో ఐక్యరాజ్యసమితిలో అమెరికా అధ్యక్షుడు జాన్ కెన్నెడీ నుంచి జవహర్ లాల్ నెహ్రూ వరకు, బాలీవుడ్ దిగ్గజం పృథ్వీరాజ్ కపూర్ నుంచి కరుణానిధి వరకు, ఎంజీఆర్ వంటివారి ప్రసంగాలను అచ్చుగుద్దినట్లు అనుకరించేవారు. హాలీవుడ్ చిత్రం ‘మెకన్నాస్ గోల్డ్’ ఎంత గొప్పగా ప్రేక్షకాదరణ పొందిందో.. ఆ చిత్రంలోని సన్నివేశాలకు వేణుమాధవ్ ధ్వన్యనుకరణ ద్వారా అంత ప్రాచూర్యం లభించింది.

అలా ప్రపం చ వ్యాప్తంగా సుమారు 30 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చా రు. 1970 దశకంలో వేణుమాధవ్ ప్రదర్శనను తిలకించడానికి వేలల్లో అభిమానులు పోటీ పడేవారు. ఆయన వైవిధ్య స్వరాలను అనుకరిస్తుంటే నవ్వుల జల్లులు కురిసేవి. ఒకనొక సందర్భంలో ప్రముఖ నటుడు, కవి హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ వేణుమాధవ్ ప్రదర్శనను వీక్షించిన తర్వాత ఇలా మాట్లాడుతూ.. “మీరు ఈ దుఃఖభరితమైన భూమి నుంచి నిష్క్రమించిన తర్వాత కూడా మిమ్మల్ని గుర్తించుకుంటారు” అని అన్నారు.

రాజకీయ.. సినీ అవకాశాలు..

1972-78 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా కొనసాగినా.. రాజకీయాలపై ఆసక్తి లేని ఆయన మళ్లీ కళ రంగం వైపే మళ్లారు. అనూహ్యంగా సినీ అవకాశాలనూ దక్కించుకున్నారు. గూఢచారి 116తో పాటు పదకొండు సినిమాల్లో నటించారు. ఆయనకు ఘంటశాలతోనూ మంచి స్నేహం ఉండేది. అమెరికా పర్యటనలో నెలరోజులు వీరిద్దరూ కలిసే ఉన్నారు. ఘంటసాల గానంతో నేరెళ్ల మిమిక్రీతో అక్కడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. అటు తర్వాతా సినీ అవకాశాలు వెల్లువెత్తినా తనకు గుర్తింపు తెచ్చిన కళకు దూరం కావడం ఇష్టం లేక వాటినీ వదులుకున్నారు. మిమిక్రీ కళకు చేసిన సేవను గుర్తించిన భారత ప్రభుత్వం 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. 2018 జూన్‌లో భౌతికంగా దూరమైనా ఆయన కీర్తి అజరామరమయ్యింది. అందుకే నేరెళ్ల పుట్టినరోజు డిసెంబర్ 28న ప్రపంచ మిమిక్రీ దినోత్సవంగా జరపడుతున్నది.   

ఎక్కని వేదిక లేదు...

వేణుమాధవ్ ధ్వన్యనుకరణను కేవలం వినోద సాధనమే కాదూ.. సృజనాత్మక కళ, సామాజిక చైతన్య గీతిగా తీర్చిదిద్దారు. ఆయన శిష్యవర్గం అత్యధికంగా హైదరాబాద్‌లో ఉన్నారు. ప్రదర్శనలు ఇవ్వడమే కాదూ.. శిష్యుల ప్రదర్శనలు ప్రేక్షకుడిగా వీక్షిస్తూ.. కళను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులే కాకుండా ప్రపంచ నేతల నుంచీ తన అసమాన ప్రజ్ఞతో మెప్పు పొందారు.

పదవుల్లో ముఖ్యమైనవి..

  1. ఎంఎల్‌సీ 
  2. ఎఫ్‌డీసీ డైరెక్టర్ 
  3. సంగీత నాటక అకాడమీ సభ్యుడు
  4. సౌత్ జోన్ కల్చరల్ కమిటీ, తంజావూరు సభ్యుడు
  5. దూరదర్శన్ ప్రోగ్రాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు 
  6. టెలికాం అడ్వయిజరీ కమిటీ సభ్యుడు 
  7. రైల్వే జోనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు 
  8. ఏపీ లెజిస్లేటివ్ లైబ్రరీ కమిటీ సభ్యుడు 
  9. రవీంద్రభారతి కమిటీ సభ్యుడు 
  10. ప్రభుత్వ అకాడమిక్ రివ్యూ కమిటీ సభ్యుడు

పురస్కారాలు..

81977 ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి 

కళా ప్రపూర్ణ బిరుదు

81982 రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు

81987 జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ 

విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్

81992 కాకతీయ  విశ్వవిద్యాలయం నుంచి  గౌరవ డాక్టరేట్

81997 కనకాభిషేకం

81998 ఎన్టీఆర్ ఆత్మ గౌరవ పురస్కారం

82001 పద్మశ్రీ

82005 తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారం

82015 - తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 

82015 జీవన సాఫల్య పురస్కారం

82018 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం