24-07-2024 12:00:00 AM
హైదరాబాద్ విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నెలవు. అలాగే ఎన్నో కళలకు బాగ్యనగరం ప్రసిద్ధి. అలాంటి వాటిలో ఒకటి ‘బిద్రి’ కళ. ఇది వందేళ్ల నాటి కళ. అపురూప ఆకృతుల ప్రాచీన కళ బిద్రి. బిద్రి అనేది ఒక లోహ కళ. నల్లని వస్తువులను బంగారు, వెండి తీగల అల్లికతో అందంగా మార్చే హస్తకళ.
బిద్రి కళతో తయారు చేసిన హుక్కా, పాన్దాన్, వాష్ బేసిన్లు, కూజాలు, అత్తరు సీసాలు, కొవ్వొత్తి స్టాండ్లు, సబ్బు పట్టెలను డిజైన్ చిన్ని చిన్న వాటర్ ఫౌంటెన్‌లను తయారు చేస్తారు. ఆయా వస్తువులపై అందమైన నగిషీలు చెక్కించి వాడిన ఘనత నిజాం నవాబులది. ఒకప్పుడు కర్నాటకలో ఉన్న బీదర్ నిజాం పాలనలో ఉండేది. అక్కడి నుంచి నైపుణ్యం కలిగిన కళాకారులను హైదరాబాద్ రప్పించి, ఇక్కడే కర్మాగారాలను ఏర్పాటు చేయించారు. ఫలితంగా బీదర్, గోల్కొండ (హైదరాబాద్) ప్రాంతాల్లో ఈ కళ ఇప్పటికీ సజీవంగా ఉంది.
ప్రస్తుతం కర్నాటకలో ఉన్న బీదర్ నుంచి ఈ పేరు వచ్చింది. ఇది బహమనీ సుల్తానుల పాలనలో 14వ శతాబ్దంలో పుట్టిందని నమ్ముతారు. బహమనీ సుల్తానులు 14 శతాబ్దాలలో బీదర్‌ను పాలించారు. మొదట్లో ఈ కళ పర్షియాలో కనిపించేది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ అనుచరులు ఇండియాకి తీసుకువచ్చారు. ఇక్కడి కొచ్చాక మన పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేకమైన శైలిని తీసుకొచ్చారు. ఇది ఎనిమిది దశల ప్రక్రియ. ఉలి, సుత్తితో చెక్కుతూ చేస్తారు. వస్తువులపై స్వచ్ఛమైన వెండిని పొదుగుతారు. కాపర్, జింక్ మిశ్రమంతో చేసిన లోహం మీద వెండి, బంగారు తీగలను చొప్పిస్తూ చేయడంతో అద్భుతంగా కనిపిస్తాయి. వాటికి నలుపు రంగు రావడానికి కాపర్ సల్ఫేట్ పూత పూస్తారు.
బిద్రి కళాఖండాల తయారీకి కావలసిన మట్టి ఎక్కువగా బీదర్, పరిసర ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతుంది. బిద్రి పాత్రల తయారీలో రెండు మూడు రకాల మిశ్రమ లోహాలను వాడుతారు. రాగి, తుత్తునాగంలను 1ః16 నిష్పత్తిలో కలిపి, బిద్రి పాత్రలను తయారు చేస్తారు. ఒక వస్తువును రూపొందించడంలో ఐదు దశలు ఉంటాయి. లోహాలను కరిగించి పోత పోయడం, నమూనా రూపకల్పన, చెక్కడం లోపల అమర్చడం, నలుపు చేయడం, మెరుగు పెట్టడం అనే ప్రక్రియలు ఇందులో ప్రధానమైనవి. ముందుగా కావాల్సిన పాత్రకు సంబంధించిన మూసను తయారు చేసి పోత పోస్తారు. పోత పోసిన పాత్రపై కాపర్ సల్ఫేట్ ద్రావణంతో నలుపు చేస్తారు. ఈ దశలోనే పాత్రపై అవసరమైన చిత్రాలు చెక్కుతారు. ఆ తర్వాత వెండి, ఇత్తడి లేదా బంగారపు తీగలను, తొలిచిన నమూనాలోనికి జొప్పించి, స్థిరంగా ఉండేలా చేస్తారు. వెండి తీగలను పాత్రపై తాపడం చేయడం చాలా శ్రమతో కూడిన వ్యవహారం.