18-11-2025 11:42:22 AM
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..
శంషాబాద్ సంఘటన హృదయ విదారం..
భార్యాభర్తల మృతితో పాటు శిశువుల మృతి..
శోకసంద్రంలో బెంగళూరుకు చెందిన కుటుంబ సభ్యులు..
రాజేంద్రనగర్,(విజయక్రాంతి): పెళ్లయి కొన్ని సంవత్సరాలు గడుస్తున్న పిల్లలు కాకపోవడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రి లో ఐవీఎఫ్(IVF) ద్వారా కృత్రిమ గర్భాధారణ(Artificial insemination) పొందిన ఒక మహిళ కాన్పు కోసం ఆసుపత్రికి వెళ్ళగా తల్లి తో పాటు కడుపులో ఉన్న ఇద్దరు కవల పిల్లలు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ లో చోటుచేసుకుంది.. వివరాల్లోకి వెళితే బెంగళూరు పట్టణం ఆర్ కే పురానికి చెందిన ముత్యాల విజయ్ శంషాబాద్(Shamshabad) లో నీ ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
భార్య శ్రావ్యతో కలిసి శంషాబాద్ లోని సాయి ఎంక్లేవ్ లో నివాసం ఉంటున్నాడు పిల్లలు పుట్టలేదన్న బాధతో భార్యాభర్తలు ఐవిఎఫ్ ద్వారా ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం తో విజయ్ భార్య శ్రావ్య గర్భాధారణ పొందింది. ఆమె గర్భధారణ 8 నెలల 15 రోజులు కావడం తో ఈనెల 16న రాత్రి 7 గంటల సమయంలో శ్రావ్యకు పురిటి నొప్పులు రావడంతో అత్తాపూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి ఆమెను తరలించారు.
అక్కడ వైద్యులు చికిత్స చేస్తుండగానే తల్లి శ్రావ్య తో పాటు గర్భంలోని ఇద్దరు కవల శిశువులు మృతి చెందారు. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించడంతో చాలాకాలంగా పిల్లల కోసం పరితపించిన విజయ్ భార్య శ్రావ్య కవల పిల్లల మరణాన్ని తట్టుకోలేక శంషాబాద్ లో అద్దెకు ఉంటున్న ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ హృదయ విదార సంఘటనపై మృతుని సోదరుడు ముత్యాల ప్రవీణ్ రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు..